
ఫుల్ టైం జాబ్.. పార్ట్ టైం క్యాబ్
ఆటోలపై ఆటమ్‌బాంబుల్లా పడిన క్యాబ్ సర్వీసులు నగరంలో మరెన్నో ట్రెండ్స్‌కు నాంది పలుకుతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు సైతం షికారు రొటీన్ లైఫ్‌లో భాగంగా మార్చేయడం మాత్రమే కాదు.. అయిదారంకెల జీతగాళ్లను వీకెండ్స్‌లో పార్ట్‌టైమ్ క్యాబ్ డ్రైవర్లుగా మారిపోయేలా చేస్తున్నాయి. కార్పొరేట్ ఉద్యోగులు సైతం మేము కూడా అంటూ వారాంతాల్లో ప్రయాణికుల కోసం స్టీరింగ్ తిప్పుతుండడం సిటీలో లేటెస్ట్ ట్రెండ్.
– ఎస్.సత్యబాబు
మొబైల్ తీసి క్యాబ్ బుక్ చేసేశారు. సరిగ్గా 5 నిమిషాల్లో... కారు ఇంటి ముంగిటకు వచ్చేసింది. దర్జాగా ఎక్కేసి గమ్యం చేరుకున్నారు. దిగిపోయాక బిల్ చెల్లించేశారు. దాంతో పాటు ఓ ఐదో పదో డ్రైవర్‌కి టిప్ కూడా విసిరేద్దామనుకుంటే మాత్రం... ఓ క్షణం ఆగి ఆలోచించాలి. ఎందుకంటే సదరు డ్రైవర్ గారు... మనకన్నా ఎక్కువ జీతం అందుకునే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావచ్చు మరి.
పార్ట్‌టైమ్ ఇన్‌కమ్..
ఓ ఎంఎన్‌సీలో టీమ్ లీడర్‌గా పనిచేసే 36 ఏళ్ల నగరవాసి మహంతికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులో పని ఉంటుంది. ఆ తర్వాత ఆయనేం చేస్తారు? క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తుతారు. ‘జీతం నా ఇంటి ఖర్చులు, లోన్‌లకి సరిపోతుంది. ఇక ఇంట్లో వాళ్లు అడిగే గిఫ్ట్స్, అత్యవసర ఖర్చులకి కావాలంటే ఎవరిస్తారు? అందుకే ఈ పార్ట్‌టైమ్ జాబ్’ అని చెప్పే ఈయన సిటీలో వేళ్లూనుకుంటున్న కొత్త ట్రెండ్‌కి ఓ ఉదాహరణ.
మరెందరో నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కార్పొరేట్ ఉద్యోగులు... క్యాబ్ డ్రైవింగ్‌ను పార్ట్‌టైమ్ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం లభిస్తోందని వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్ మీద ఆసక్తితో, అదనపు ఆదాయం కోసం... ఇలా విభిన్న కారణాలతో వీరు స్టీరింగ్ తిప్పుతున్నారు. చివరికి కొందరు ఉద్యోగాలు వదిలేసి మరీ దీనిని కొనసాగిస్తున్నారు.
నచ్చిన సమయంలో.. నచ్చినంత సేపు
ఇష్టం వచ్చిన సమయంలో, ఇష్టం వచ్చినంత సేపు పనిచేయడం.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయడం.. అంతా నా ఇష్టం అన్నట్టుగా పనిలో తీరిక ఉండడంతోనే ఉద్యోగులు దీని వైపు ఆకర్షితులవుతున్నారు. ‘నాకు కుదిరిన టైమ్‌లో పని చేసుకునే వెసులుబాటు ఉండడమే నేనీ పార్ట్‌టైమ్ జాబ్ ఎంచుకోవడానికి కారణమ’ని ఒక ఎంఎన్‌సీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న రఘునాథ్ చెప్పారు.
ఈ పార్ట్‌టైమ్ జాబ్‌ను కార్పొరేట్ ఉద్యోగులే అందిపుచ్చుకోవడానికి కారణం లేకపోలేదు... ఎందుకంటే వీరే ఎక్కువగా క్యాబ్స్ ఉపయోగిస్తారు కాబట్టి. ఒకప్పటిలా డ్రైవర్‌ని చిన్నచూపు చూసే పరిస్థితులు లేకపోవడంతో కుటుంబసభ్యులు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు. ఇప్పుడిప్పుడే మన సిటీలో వేళ్లూనుకుంటున్న ఈ ధోరణి.. మరెంతో మందిని ఆకర్షించడం తథ్యంగా కనిపిస్తోంది.
మెట్రోల ట్రెండ్
ముంబై, బెంగళూర్ లాంటి మెట్రో నగరాల్లో ఖరీదైన జీవనశైలిని తట్టుకోవడానికి చాలా మంది కార్పొరేట్ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఈ పంథాను ఎంచుకుంటున్నారు. ‘నేను జాబ్‌కు గుడ్‌బై చెప్పేసి క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాను. నా ప్రయాణీకులు చాలా మంది జాబ్ ఆఫర్ ఇచ్చార’ని ఎంఎన్‌సీలో పనిచేసిన మోహిత్(28) చెప్పారు. పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు రావడంతో కార్పొరేట్ జాబ్‌కు గుడ్‌బై చెప్పానని, అక్కడి కంటే మిన్నగా నెలకు రూ.80 వేల వరకు ఆదాయం వస్తోందని చెప్పారు. సొంతంగా స్టార్టప్ ప్రారంభించే వరకు ఇదే తన జీవనాధారం అన్నారు.