సాక్షి ప్రతినిధి, విజయవాడ: జిల్లాలో ఆన్‌లైన్ మోసాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారి నుంచి ఉన్నత విద్యాభ్యాసం చేసిన, ఉద్యోగులు.. ఆన్‌లైన్ మోసాల్లో చిక్కుకుంటున్నారు. నిరుద్యోగులకు, యువతకు కొందరు కేటుగాళ్లు వల వేస్తున్నారు. ఖాళీ సమయంలో పార్ట్ టైంగా ఇంటి వద్దే ఉండి ఉద్యోగం చేయండి, భారీగా సంపాదించే అవకాశం ఉంది అంటూ మాయగాళ్లు పెద్ద ఎత్తున యువత నుంచి అందిన మేరకు దోచుకొంటున్నారు. ఇలాంటి కేసులు నగరంలో ఇటీవల ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఆ ప్రకటనలు నమ్మి పలువురు ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు, మోసగాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు.
ఊడ్చేస్తున్నారు
ఇలాగే విజయవాడలోని యువతి మొబైల్‌కు.. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చని ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో వీడియోలకు లైక్ చేస్తే చాలని, అన్నింటికి లెక్కకట్టి డబ్బులు వేస్తామని నమ్మపలకగా ఆమె అంగీకరించి బ్యాంకు ఖాతా వివరాలను పంపింది. మొదట మూడు వీడియోలకు లైక్ చేసినందుకు రూ.150, ఆరు వీడియోలకు లైక్ చేసినందుకు రూ.300 బ్యాంకు ఖాతాలో వేశారు. ప్రీపెయిడ్ టాస్క్‌లు చేస్తే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని మాయగాళ్లు నమ్మబలికారు. తొలుత రూ.1000 చెల్లిస్తే, తిరిగి రూ.1600 బ్యాంకు ఖాతాలో వేశారు. ఇలా విడతల వారీగా ఆమె 19 లక్షలు బ్యాంకు ఖాతాకు బదిలీ చేసి మోస పోయింది. ఇలా నగరంలో ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చనే మొయిల్‌లను నమ్మి మోసపోతూనే ఉన్నారు.
యువతను ఆకర్షించి..
కొంత మంది యువత ప్రభుత్వ పథకాల కోసం అకౌంట్లను ప్రారంభిస్తున్నారు. ఇలాంటి వారిని కొన్ని ముఠాలు ఆకర్షిస్తున్నాయి. వారికి పార్ట్‌టైమ్ జాబ్‌లు, కమిషన్ వస్తుందని ఆశ చూపుతున్నారు. వీరి అకౌంట్‌లకు లింక్ అయిన ఫోన్ నంబర్లను అన్‌లైన్‌లోనే మార్చి, వారి ఫోన్ నంబర్లకు లింక్ చేసుకొని ఖాతాలను వాడుకొంటున్నారు. ఇలా పలు బ్యాంకు అకౌంట్‌ల నుంచి మాయ మాటలతో డబ్బులు సేకరించి, ఒక కరెంటు అకౌంట్‌కు బదిలీ చేసుకొని, దానిని క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. దీంతో ఆ డబ్బు ఏదేశానికి ఎక్కడికి వెళ్లింది కూడా తెలియని పరిస్థితి. గల్ఫ్, హాంకాంగ్, బంగ్లాదేశ్, మలేషియా దేశాలకు ఉద్యోగాల కోసం ఇండియా నుంచి వెళ్లిన వారిని మాయగాళ్లు ఉపయోగించుకొంటున్నారు. యూఎస్‌బేస్ సర్వర్‌లు ఆ దేశాల నుంచి నిర్వహిస్తుండటంతో, మోసగాళ్ల ఆట కట్టించడం కూడా కష్టంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment