♦ రుణమాఫీకి నిధుల కొరత
♦ ఏటా ఇవ్వాల్సింది పావువంతు నిధులు
♦ ఈసారి మంజూరైనవి6.25 శాతమే
♦ పంపిణీపై తలలుపట్టు కుంటున్న వ్యవసాయశాఖ
♦ వచ్చిన వాటితో సరిపెడదామని నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయ రుణమాఫీ పథకానికి నిధుల కొరత వచ్చింది. రాష్ట్ర అవతరణ రోజు నాటికి తీసుకున్న పంటరుణాలపై రూ.లక్ష వరకు మాఫీ చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమల్లోకి తీసుకొచ్చిన ఈ పథకానికి యేటా 25శాతం నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 25శాతం చొప్పున నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసింది. తాజాగా మూడో విడత కింద జిల్లాకు రూ.250.166 కోట్లను 1,99,653 మంది రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ తాజాగా జిల్లాకు కేవలం రూ.62.83 కోట్లు మాత్రమే విడుదల కావడం గమనార్హం.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రుణమాఫీ నిధుల్లో ప్రభుత్వం కోత పెట్టడంతో వ్యవసాయ శాఖ గందరగోళంలో పడింది. వాస్తవానికి 25శాతం నిధులు వస్తే.. రైతులకు గతంలో పంపిణీ చేసిన విధంగా ఈసారి అదేతరహాలో నిధులను రైతు ఖాతాల్లో జమచేయవచ్చని అధికారులు భావించారు. కానీ 25శాతం నిధులు కాకుండా 6.25 శాతం నిధులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్రమంలో నిధులను రైతులకు సమానంగా పంచాలని యంత్రాంగం నిర్ణయించింది. ప్రతి రైతు ఖాతాలో 25శాతం కాకుండా 6.25 శాతం నిధులు జమచేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ బిల్లులు సిద్ధం చేస్తోంది. వారంలోగా ఈ బిల్లులు ఖజానా విభాగానికి పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పంటరుణాలపై ప్రభావం..
ఖరీఫ్ రుణాలపై పంటరుణ మాఫీ ప్రక్రియ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉం డడం.. వర్షాలు ఓ మోస్తరుగా పడుతుండడంతో సాగుపనులు జోరందుకున్నాయి. ఈ క్రమంలో పెట్టబడుల కోసం రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునేందుకు రైతులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బ్యాంకులకు రావాల్సిన రుణమాఫీ నిధులకు ప్రభుత్వం కోత పెట్టడంతో కొత్తగా రుణాలివ్వడంలో బ్యాంకులు వెనక్కు తగ్గే అవకాశాలున్నాయి. బ్యాంకుల వారీగా లక్ష్యాలుండడం... రుణమాఫీ నిధులు సకాలంలో రాకపోవడంతో రైతులకు ఇచ్చే ఖరీఫ్ పంటరుణాలను పరిమితం చేసే అవకాశం లేకపోలేదు. దీంతో ఈసారి ఖరీఫ్ సీజన్లో రైతులకు బ్యాంకుల నుంచి ఆర్థిక సహకారం అంతంతమాత్రమేనని తెలుస్తోంది.