రుణమాఫీ నిధులు విడుదల చేయాలి
-
చేనేత సొసైటీల అధ్యక్షుల సమావేశంలో తీర్మానం
అంగర (కపిలేశ్వరపురం) :
చేనేత రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షుల సమావేశంలో తీర్మానం చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో సహకార సంఘాల నిర్వహణ కష్టంగా మారిందని నేతలు అసహనం వ్యక్తం చేశారు. మండలంలోని అంగర గణ పతి చేనేత సహకార సంఘంలో చింతకింద రాము అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ దొంతంశెట్టి విరూపాక్షం హాజరయ్యారు. సభకు స్థానిక సొసైటీ అధ్యక్షుడు కుడకా వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ ఏడాది ఆగస్టు ఆరున ఖరారు చేసిన ధర్మవరం డిక్లరేషన్‌ను వెంటనే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ప్రకారం చేనేత రుణమాఫీ నిధులను విడుదల చేయాలని, ప్రభుత్వం మంజూరు చేస్తున్న సిలపనూళ్ల సబ్సిడీలో 50 శాతం మొత్తాన్ని సంఘాలలో పనిచేస్తున్న సభ్యులకు ప్రొడక్షన్ బోనస్‌గా వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. చేనేత సంక్షేమానికి సిఫారసులు చేయడానికి అనుభవమున్న ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు, సంఘాల వస్త్రృ విక్రయాలపై నిరంతర రిబేటు అమలు, ఉత్పత్తులను నేషనల్ టెక్స్‌టైల్స్ కార్పొరేషన్ ద్వారా విక్రయాలు జరపడం అనే నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంది. వీటి పరిష్కారానికి అధికారులు సక్రమంగా వ్యవహరించడం లేదని ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. డీసీసీబీ డైరెక్టర్లు మేడిశెట్టి బాలయ్య, అంకం వీర్రాజు, సహకార సంఘాల అధ్యక్షుడు చింతా వీరభద్రీశ్వరరావు పాల్గొన్నారు.