పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలి
-
వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాలిరెడ్డి
ఒంగోలు: కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోందని.. తక్షణమే నిధులు విడుదల చేయాలని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి రాష్ట్ర డిమాండ్ చేశారు. శాఖ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సరెండర్ లీవును నగదుగా మార్చుకునేందుకు ఖజానా శాఖకు బిల్లులు చెల్లించినా ఫ్రీజింగ్ ఆంక్షల వల్ల బిల్లులు మంజూరుకావడంలేదన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సమ్మెటివ్ –1 కు సంబంధించి 5శాతం జవాబు పత్రాల మూల్యాంకనం బయటి మండలాలకు చెందినవారితో వెరిఫికేషన్ చేయకుండా.. అదే మండలానికి సంబంధించి వారితో పరిశీలన నిర్వహించాలన్నారు. పదవీ విరమణ చేసిన పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వెంకటేశ్వరరెడ్డి, జీ.చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ హెల్త్ స్కీంను చాలా కార్పొరేట్ ఆస్పత్రుల్లో అంగీకరించడంలేదని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రకటించాలని, పీఆర్‌సీ జీవోలను విడుదల చేయాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు పాలెం నాగేశ్వరరావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి వరిమడుగు వెంకట్రామిరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు డి.సి.హెచ్. మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.