సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కలెక్టరేట్ కొత్త భవన నిర్మాణానికి కాలం కలసి రావడం లేదు. దీని కోసం విడుదలైన నిధులు మళ్లీ వెనక్కి వెళ్లిపోయాయి. రెండేళ్ల కిందట నిధులు మంజూరైనప్పటికీ .. స్థలం ఖరారు కాకపోవటంతో వెనక్కి మళ్లిపోయాయి. ఈసారి ఏ కారణం లేకుండానే సర్కారు విడుదల చేసిన నిధులను వెనక్కి తీసుకోవడం గమనార్హం. శిథిలావస్థలో ఉన్న నాంపల్లి పాత కలెక్టరేట్ భవన్ స్థానంలో కొత్తది నిర్మాణానికి ప్రభుత్వం రూ.19.80 కోట్లు విడుదల చేసింది. జిల్లాల పునర్విభజనలో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. రెండు జిల్లాలుగా చేయాలన్న అధికార యంత్రాంగం ప్రతిపాదనలకు విపక్షాల ఒత్తిడి కారణంగా బ్రేక్ పడింది. దీంతో కలెక్టరేట్ భవన నిర్మాణానికి ఆటంకాలు తలెత్తాయి. జనాభా ప్రాతిపదికన కొత్త మండలాలు ఏర్పడగలవన్న ఆశలకు కూడా తెరపడినట్లయింది. నిధులు వెనక్కి మళ్లడంతో ఇంకెంత కాలం శిథిల భవన సముదాయాల్లో విధులు నిర్వహించాలనని ఉద్యోగులు అందోళన చెందుతున్నారు.