ఆకుపచ్చ జిల్లాగా సిద్దిపేట | future green district is siddipeta | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ జిల్లాగా సిద్దిపేట

Published Wed, Sep 14 2016 9:34 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

మంత్రి హరీశ్‌రావుకు  సన్మానం

మంత్రి హరీశ్‌రావుకు సన్మానం

సమైక్య రాష్ర్టంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం
భవిష్యత్తులో గ్రీన్‌ డిస్ట్రిగ్‌గా మార్పు
రాష్ర్ట మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట జోన్‌: ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న సిద్దిపేటను.. ఆకుపచ్చ జిల్లాగా మార్చేందుకు సర్వత్రా కృషి చేస్తున్నట్టు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా జిల్లాను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సిద్దిపేట జిల్లాలో సహజ వనరులు-అభివృద్ధి అవకాశాలు అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా గురించి బాధాకరమైన అంశాలు ఉన్నాయన్నారు. దుబ్బాక, గజ్వేల్‌, సిద్దిపేట, ఇల్లంతకుంట తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పొట్ట చేతపట్టుకొని బతుకు కోసం వలసలు వెళ్లిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ర్ట ముఖచిత్రంతో పోలి ఉండే సిద్దిపేట జిల్లా ప్రస్తుత కరువు పరిస్థితి నుంచి భవిష్యత్తులో సస్యశ్యామల జిల్లాగా మార్పు చెందడం ఖాయమన్నారు.

60 సంవత్సరాల ఉమ్మడి రాష్ర్టంలో సిద్దిపేట ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. 1969లో తొలిదశ ఉద్యమంలో అనంతుల మదన్‌మోహన్‌ అందించిన సిద్దిపేట గడ్డ మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌ లాంటి చరిత్రకారుడిని అందించిందన్నారు. వామపక్ష భావాలకు సిద్దిపేట కేంద్రంగా నిలిచిన చరిత్ర కూడా ఉందన్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆలోచనా విధానం
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆలోచన విధానం మేరకు పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు , చిన్న జిల్లాల ఏర్పాటు ఎంతో ముఖ్యమని హరీశ్‌రావు అన్నారు. దేశంలో 683 జిల్లాల్లో 121 కోట్ల జనసంద్రత.. సగటున ప్రతి జిల్లాకు 18 లక్షల జనసాంద్రత ఉందన్నారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ర్టంలోని 10 జిల్లాల్లో 3.60 కోట్ల జనసాంద్రత ఉండగా సగటున జిల్లాకు 36 లక్షల జనాభా ఉందన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే 27 జిల్లాల్లో సగటున 13 లక్షల 30 వేల జనాభా జనసాంద్రత ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లాలో మాత్రం 11 లక్షల జనాభా ఉందన్నారు.

ఆలయాల గని సిద్దిపేట
సిద్దిపేట జిల్లాలో ఆలయాలు మెండుగా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అంతగిరి పోచమ్మ, సిద్దిపేట కోటిలింగాలు, వర్గల్‌, అనంతసాగర్‌, సరస్వతి ఆలయాలు.. కొమురవెల్లి మల్లన్న, కొండ పోచమ్మలాంటి ప్రసిద్ధ ఆలయాలకు నూతన సిద్దిపేట జిల్లా కేంద్రంగా మారిందన్నారు. దేశంలోనే అతి ఎక్కువ సాగునీటి వనరులున్న జిల్లాగా సిద్దిపేట భవిష్యత్తులో మారనుందరి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇల్లంతకుంట మిడ్‌ మానేరు ద్వారా 25 టీఎంసీలు, పోచమ్మ సాగర్‌ 3.5 టీఎంసీలు, రంగనాయక సాగర్‌ 3.5 టీఎంసీలు, 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌ 7.5 టీఎంసీలు, గౌరిపల్లి రిజర్వాయర్‌ 8.5 టీఎంసీలు, గంగిరెడ్డిపల్లి ద్వారా 2 టీఎంసీల సామర్థ్యంతో కూడిన ప్రాజెక్ట్‌ల నిర్మాణం కొనసాగుతుందన్నారు.

నల్లగొండ, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చే దిశగా సిద్దిపేట ప్రాజెక్ట్‌లు చరిత్రలో నిలుస్తాయన్నారు. రిజర్వాయర్‌ల ద్వారా 10 శాతం నీటిని పరిశ్రమలకు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ముందస్తుగానే నిర్ణయం తీసుకున్నారన్నారు. భవిష్యత్తులో సిద్దిపేట పట్టణం 2 లక్షల జనాభాకు చేరుకుంటుందన్నారు.

జిల్లాకు మూడో జాతీయ రహదారి
ఇప్పటికే రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా మారనున్న సిద్దిపేటకు మరో సువర్ణ అవకాశం లభించనుందని మంత్రి తెలిపారు. మూడో జాతీయ రహదారిగా సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్‌ మార్గానికి కేంద్రం త్వరలో పచ్చజెండా ఊపనుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

వీడిపోయినా ఆత్మీయులుగా ఉందాం
మెదక్‌ జిల్లా విడిపోయినప్పటికీ ప్రజలు, నాయకులు, అధికారులు ఆత్మీయులుగా కలిసి ఉండాలని రాష్ర్ట  శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్‌ జిల్లా మంత్రిగా హరీశ్‌రావు నేటి వరకు అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులో సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుందన్నారు.

కేసీఆర్‌, హరీశ్‌రావుల సహకారంతో మెదక్‌ జిల్లా ఏర్పడిందని.. ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతులు చెప్పారు. అంతకు ముందు ప్రముఖ పరిశోధకుడు గోపాల సుదర్శనం.. జిల్లాలోని సహజ వనరులు, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావును, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ర్ట కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ అక్తర్‌, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, గ్యాదరి రవి, సాకి ఆనంద్‌, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి, లెక్చరర్లు హరినాథ శర్మ, రవికుమార్‌, దుర్గాప్రసాద్‌, మామిడాల శ్రీనివాస్‌, భవానీ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement