
నమ్మి మోసపోయామయ్యా..
* డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు
* బెల్టు షాపులు ఉండవన్నారు
* బాబొస్తే జాబు వస్తుందన్నారు
* దుమ్మెత్తిపోసిన మహిళలు, యువత
* ‘గడపగడపకు వైఎస్సార్’ కార్యక్రమానికి విశేష స్పందన
సాక్షి, రాజమహేంద్రవరం: ‘డ్వాక్రా రుణాలు ఎవ్వరూ కట్టొద్దు. నేను అధికారంలోకి రాగానే బేషరతుగా మాఫీ చేస్తాను. తర్వాత లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాను’. ‘మద్యం అమ్మకాలు తగ్గిస్తాం. బెల్టు షాపులు ఎత్తివేస్తాం.’ ‘ బాబొస్తేనే జాబు వస్తుంది’ అని ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని డ్వాక్రామహిళలు, యువత ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఆయన ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు చేశారో మీరే చెప్పండంటూ నిర్వహిస్తున్న ‘గడపగడపకు వైఎస్సార్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చంద్రబాబు ఇచ్చిన 600 హామీలలో ముఖ్యమైన 100 వాగ్దానాలతో వైఎస్సార్ సీపీ రూపొందించిన ప్రజాబ్యాలెట్ ను ప్రజలకు ఇచ్చి, నేతలు వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. జిల్లాలో 11 నియోజకవర్గాల్లో శుక్రవారం ‘గడపగడపకు వైఎస్సార్’ కార్యక్రమం జరిగింది. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడిపూడి చిట్టాబ్బాయి ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకున్నారు.
పి.గన్నవరం మండలం ఎర్రజెట్టివారిపాలెంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. 300 ఇళ్లు తిరిగిన ఆయన వద్ద ఇళ్ల రుణాలు, ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలేదని, గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు.
* మండపేట పట్టణం 7వ వార్డులో నియోజకవర్గం కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫించన్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంలేదని స్థానికులు ఆయన వద్ద వాపోయారు.
* జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మల్లేపల్లిలో కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాసులు కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్యం, ఇళ్ల స్థలాలు, రుణాలు ఇవ్వడంలేదని స్థానికులు ఆయన దృష్టి తీసుకువచ్చారు.
* సామర్లకోట మండలం పవర గ్రామంలో కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి తోట సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆవాల లక్ష్మినారాయణ, సీనియర్ కౌన్సిలర్ ఊబా జాన్‌మోజెస్ తదితరులు పాల్గొన్నారు.
* కాకినాడ 36వ డివిజన్‌లో సిటీ కో ఆర్డినేటర్ గుత్తా శశిధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి ఆదిత్యకుమార్, మాజీ కార్పొరేట్లు పాల్గొన్నారు. అర్హతలున్న ఫించన్లు రావడంలేదని, రోజూ మురుగు తొలగించడంలేదని స్థానికులు శశిధర్ దృష్టి తీసుకొచ్చారు.
* పిఠాపురం పట్టణం ఒకటి, ముప్పై వార్డుల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. మంచినీటి పథకం పూర్తి చేయకపోవడంతో తాగునీటికి అల్లాడుతున్నామని స్థానికులు వాపోయారు.
బెల్టు షాపులతో ఇళ్లు గుల్లవుతున్నాయి...
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురజనాపల్లిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో విచ్చలవిడిగా బె ల్టుషాపులు నిర్వహిస్తుండడంతో కుటుంబాలు కూలిపోతున్నాయని కన్నబాబు వద్ద మహిళలు వాపోయారు. బెల్టు షాపులు ఎత్తివేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
దివ్యాంగులమైనా కనికరంలేదు
తాము దివ్యాంగులమైనా పింఛన్లు రావడం లేదని, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని గొంది గ్రామంలో ఇద్దరు దివ్యాంగులు ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, అధైర్య పడొద్దని పర్వత వారికి భరోసా ఇచ్చారు. శంఖవరం మండలం అచ్చంపేట, గొంది, రాజవరం గ్రామాల్లో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం జరిగింది.
ఎన్ని సార్లు తిరిగినా పింఛన్ పునరుద్ధరించ లేదు
‘గతంలో వికలాంగుల ఫించన్ వచ్చేది. తర్వాత తీసేశారు. అధికారుల వద్దకు ఎన్నిసార్లు తిరిగినా కనికరించలేదు’ అంటూ సీతారామపురానికి చెందిన అంధురాలు వెలుగుబండి అనంతలక్ష్మి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లల గల అనంతలక్ష్మి మూడో సంతానం తర్వాత కంటి చూపును కోల్పోయింది.
గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పింఛన్‌ను చంద్రబాబు ప్రభుత్వం రాగానే తొలగించారని ఆమె వాపోయింది. కోరుకొండలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కార్యక్రమం నిర్విహ ంచారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనాన్ని కట్టెలపొయ్యిపై సిద్ధం చేయాల్సి వస్తోందని, దాంతో తాము అనారోగ్యం పాలవుతున్నామని మహిళలు విజయలక్ష్మి వద్ద వాపోయారు.
పేదలకు వైద్యం దూరం చేశారు
కొత్తపేట మండలం మందపల్లి, కొత్తపేట శివారు ఏనుగుల మహల్ గ్రామాల్లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కార్యక్రమం నిర్వహించారు. ఫించన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడంలేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా పేద, సామాన్య ప్రజానీకానికి అన్ని రోగాలకు కార్పొరేట్ వైద్యం అందించగా దానిని టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా మార్చి కొన్నింటికే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.