మట్టి విగ్రహాలు, శ్రీకాంత్, మెదక్
- విగ్రహాలకే ప్రాణం.. అద్భుత తయారీ
- పర్యావరణ పరిరక్షకుడిగా శ్రీకాంత్
మెదక్: పుట్టుకతో మూగ, చెవిటి అయినా ఓ బాలుడు అద్భుతంగా మట్టివిగ్రహాలను తయారు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. వినాయక చవితికి నెలరోజుల ముందు నుంచే అనేక రకాల వినాయక విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షకుడిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నాడురు.
మెదక్ పట్టణంలోని వవాబుపేట వీధికి చెందిన చింతకింది బాలవ్వ, సత్తయ్య దంపతులకు ముగ్గురు సంతానం. అందులో చిన్నవాడైన చింతకింది శ్రీకాంత్ పుట్టుకతోనే మూగ, చెవిటి. కాగా స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే బొమ్మలేయటం అంటే ఎంతో ఇష్టం.
అతను తయారు చేసిన బొమ్మలు చూస్తే దేవుడి ఆకారం ఇలానే ఉంటుందని పిస్తుంది. అంతటి అద్భుతంగా మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా వినాయక విగ్రహాలతో పాటు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇతర దేశనాయకుల విగ్రహాలనుసైతం తయారు చేస్తునాడు.
అతని అద్భుత కళారూపాన్ని గమనించిన మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ రెండు సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలకు ఆ బాలుడు తయారు చేసిన విగ్రహాలను కొనుగోలు చేసి మున్సిపల్‌లో పెట్టి పూజలు చేస్తున్నారు. పట్టణ ప్రజలు కూడా పోటీపడి కొనుగోలు చేసి పూజలు చేస్తున్నారు.
మట్టివిగ్రహాలతో పర్యావరణానికి ఎలాంటి హానికలగని విధంగా అందంగా తీర్చి దిద్దుతున్న ఈ బాలుడిని రెండు సంవత్సరాలుగా మున్సిపల్ పాలక వర్గం గనంగా సన్మానిస్తోంది. మట్టిముద్దలకు అద్భుత రూపం ఇస్తూ అందరిని ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ కుటుంబం మాత్రం పేదరికంతో నిత్యం పోరాటం చేస్తూనే ఉంది.
పర్యావరణ పరిరక్షకుడు శ్రీకాంత్
పుట్టుకతో మూగ, చెవిటి అయిన శ్రీకాంత్ మట్టితో అద్భుతంగా వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా శ్రీకాంత్ తయారు చేసిన విగ్రహాలనే మున్సిపల్‌లో పెట్టి నవరాత్రి పూజలు చేస్తున్నాం. పట్టణంలోని ప్రజలు కూడా కొనుగోలు చేస్తుంటారు. దీంతో పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి ఆటంకం కలుగదు. - మల్లికార్జున్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్