గంజాయి ప్యాకెట్లు, నిందితులు, కారును చూపుతున్న సీఐ సత్యనారాయణ తదితరులు
తీగ దొరికినా.. డొంక కదలదు
Published Sat, Jul 23 2016 7:58 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
కొరియర్ పద్ధతిలో.. వాహనాల్లో గంజాయి రవాణా
ఒక కొరియర్‌తో మరొకరికి పరిచయం ఉండదు
గంజాయి రవాణాదారుల విచారణలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
తీగ లాగితే డొంక కదిలిందంటారు. గంజాయి స్మగ్లింగ్ విషయంలో పోలీసులకు రవాణాదారుడు దొరికినా అసలు స్మగ్లర్లు దొరకడం లేదు. కారణం రవాణాదారుల తో అసలు స్మగ్లర్లకు నేరుగా సంబంధం ఉండకపోవడమే. పకడ్బందీగా కొరియర్ వ్యవస్థతో స్మగ్లర్లు గంజాయి రవాణా చేస్తున్నారు.
– అన్నవరం
అన్నవరంలో శుక్రవారం 75 కిలోల గంజాయితో పట్టుబడిన ముగ్గురు నిందితులను శనివారం అన్నవరం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గంజాయి రవాణా చేయడానికి స్మగ్లర్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతిని ప్రత్తిపాడు సీఐ సత్యనారాయణ వివరించారు.
ఒకరికొకరు తెలియకుండా..
మధ్యాహ్నం 12 గంటలు. విశాఖపట్నం వైపు నుంచి గంజాయి ప్యాకెట్ల లోడు లారీ వచ్చి ప్రత్తిపాడు హైవే మీద పెట్రోల్ బంక్ పక్కన ఆగింది. అందులో నుంచి డ్రైవర్ దిగి బంక్‌కు సమీపంలోని దాబాలో టీ తాగి, అక్కడే కూర్చున్నాడు. గంట తర్వాత మరో వ్యక్తి వచ్చి ఆ లోడు లారీ ఎక్కి దానిని రాజమండ్రి వైపు తీసుకెళ్లిపోయాడు. ఇదంతా చూస్తున్న ఆ లారీ డ్రైవర్ తన లారీని మరొకరు పట్టుకుపోతున్నారని గట్టిగా అరవలేదు. పోలీసులకూ ఫోన్ చేయలేదు. కొంతసేపు అక్కడే ఉండి, తర్వాత ఎటో వెళ్లిపోయాడు.
మరుచటి రోజు అదే సమయానికి మరలా అదే లారీ (ఈసారి లోడు లేదు) హైవేపై మరో పెట్రోల్ బంక్ వద్ద ఆగింది. అందులో డ్రైవర్ కిందకు దిగి వెళ్లిపోయాడు. కొంతసేపటికి మరో వ్యక్తి వచ్చి ఆ లారీని విశాఖపట్నం వైపు తీసుకెళ్లిపోయాడు. ఇటీవల కాలంలో గంజాయి అక్రమ రవాణాకు స్మగ్లర్లు అనుసరిస్తున్న కొత్త రకం పద్ధతి ఇది. కొరియర్ వ్యవస్థలాంటి స్మగ్లింగ్ విధానమిది. ఇందులో పనిచేసే వారిలో ఒక వ్యక్తికి మరొకరికి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ లారీతో పట్టుబడితే, ఆ లారీ డ్రైవర్ మినహా మరెవరి పేరూ వెలుగులోకి రాదు. లారీ అనే కాదు, చిన్న కార్లకు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నట్టు పోలీసు దర్యాప్తులో వెలుగుచూసింది.
గంజాయి పౌడర్‌గా మారితే రూ.లక్షలే..
గంజాయి ధర ఆకుగా ఉన్నప్పుడు కిలో వందల రూపాయల్లో ఉంటుంది. దానిని గట్టిగా నొక్కి ప్యాకింగ్ చేస్తే వేల రూపాయలు పలుకుతుంది. అదే గంజాయిని పౌడర్ (హెరాయిన్)గా మారిస్తే లక్షల రూపాయల విలువ చేస్తోంది. అందువల్లే స్మగ్లర్లు ఖరీదైన వాహనాలను కూడా గంజాయి స్మగ్లింగ్‌కు ఉపయోగిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసులకు అవి పట్టుబడితే సీజ్ చేస్తారని తెలిసినా వెనుకాడడం లేదు.
నిందితులు కోర్టుకు తరలింపు
గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులు విశాఖ జిల్లా రోలుగుంట మండలం, వెన్నగోపాలపట్నం గ్రామానికి చెందిన మేలాసు సూర్యనారాయణ, చిటికెల ఈశ్వర వెంకటరావు, ఇదే జిల్లా వి.మాడుగుల మండలం గాదరాయికి చెందిన కారు డ్రైవర్ మట్టా శ్రీనును పోలీసులు శనివారం ప్రత్తిపాడు కోర్టులో హాజరుపరిచారు. శ్రీనుది సొంత కారు కాదు. అతడు మరొకరి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ.. రూ.60 వేల కిరాయికి ఆశపడి గంజాయిని కారులో తరలిస్తూ పోలీసులకు దొరికిపోడు. రూ.8 లక్షల విలువైన కారును, రూ.75 వేల విలువైన 75 కిలోల గంజాయిని కోర్టుకు అప్పగించారు. గత వారం ఎర్రవరం వద్ద వ్యాన్‌లో 624 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన వెంట అన్నవరం ఎస్సై కె.పార్థసారధి ఉన్నారు.
Advertisement
Advertisement