స్మగ్లింగ్‌ కేరాఫ్‌ కొరియర్స్‌ | smugglers take cargo and courier route | Sakshi
Sakshi News home page

స్మగ్లింగ్‌ కేరాఫ్‌ కొరియర్స్‌

Published Mon, Aug 12 2024 8:51 AM | Last Updated on Mon, Aug 12 2024 8:51 AM

smugglers take cargo and courier route

నిఘా, పన్నులు తప్పించుకోవడానికే..

నగదు చెల్లింపులన్నీ అక్రమ మార్గంలోనే

కలకలం సృష్టించిన ఎఫిడ్రిన్‌ స్వాధీనం

సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరులో తయారైన మాదకద్రవ్యం ఎఫిడ్రిన్‌ను నగరంలోని అక్బర్‌బాగ్‌ నుంచి కొరియర్‌ ద్వారా ఆస్ట్రేలియా పంపాలని చూసిన ముఠాను నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.

ఢిల్లీలోని ఓ కొరియర్‌ సంస్థ హిమాయత్‌నగర్‌లోని వ్యాపారికి వజ్రాలను పార్శిల్‌ చేసింది. వీటిని కొరియర్‌ ఉద్యోగులే తస్కరించడంతో ఏళ్లుగా జరుగుతున్న అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.

ఓ కొరియర్‌ సంస్థ ద్వారా హాంకాంగ్‌ వెళ్తున్న ఓ పార్శిల్‌ను ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్‌ అధికారులు స్కానింగ్‌ చేశారు. ఫలితంగా అందులో రూ.5 లక్షల విలువైన ఎర్ర చందనం ఉన్నట్లు తేలడంతో అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

హైదరాబాద్‌ నుంచి న్యూజిలాండ్‌కు కొరియర్‌ ద్వారా అక్రమంగా ఎఫిడ్రిన్‌ రవాణా చేస్తున్నారంటూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు (డీఆర్‌ఐ) సమాచారం అందింది. శనివారం ఓ కొరియర్‌ కార్యాలయంలో సోదాలు చేసి మూడు కేజీలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఉదంతాలే కాదు.. తెరపైకి రాకుండా చాపకింద నీరులా కొరియర్స్‌ ద్వారా సాగిపోతున్న బంగారం, వజ్రాలు, ఎర్రచందనం, మాదకద్రవ్యాల దందాకు నగరంలో కొదవేలేదు. ఏళ్లుగా ‘బులియన్‌ మార్కెట్‌’ అక్రమ దందా సాగుతుండగా.. కొన్నేళ్లుగా ఎర్ర చందనాన్నీ కొరియర్స్‌ ద్వారా దేశం దాటించడం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకూ కొరియర్స్‌ను వాడుతున్నారని వెలుగులోకి వచ్చింది.

అవి ఇక్కడికి.. ఇవి అక్కడికి..
హోల్‌సేల్‌గా బంగారాన్ని కిలోల లెక్కన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు, వజ్రాలను ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ తీసుకువచ్చి రిటైలర్స్‌కు, జ్యువెలరీ దుకాణ యజమానులకు విక్రయిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో తీసుకుని రావడానికీ వెనుకంజ వేస్తున్న వ్యాపారులు ఏకంగా పార్శిల్స్‌ చేసి పంపిస్తున్నారు. అలాగే నగర శివార్లతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల్లోనూ ఖాయిలా పడ్డ ఫార్మా పరిశ్రమలు అనేకం ఉన్నాయి. వీటితో పాటు కొందరి ఇళ్లూ డ్రగ్స్‌ కార్ఖానాలుగా మారిపోతున్నాయి. ప్రధానంగా ఎఫిడ్రిన్‌, ఆల్ఫాజోలం తదితరాలు వీటిలో తయారవుతున్నాయి. వీటి ధర ఇక్కడ కిలో రూ.లక్షల్లో ఉండగా.. విదేశీ విపణిలో మాత్రం రూ.కోట్లు పలుకుతోంది. దీంతో ఆ సరుకులు కొరియర్స్‌ ద్వారా సిటీకి వస్తుండగా.. ఎఫిడ్రిన్‌, సూడో ఎఫిడ్రిన్‌ వంటి డ్రగ్స్‌ సిటీ నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి.

ఆర్థిక లావాదేవీలకు అక్రమ మార్గంలో..
వీటిలో ఏవి ఎటు వచ్చినా, వెళ్లినా... చెల్లింపులు మాత్రం నేరుగా, బ్యాంకు ఖాతాల ద్వారా సాగించరు. దీనికి అనేక మంది వ్యాపారులు, స్మగ్లర్లు అక్రమ ద్రవ్య మార్పిడైన హుండీ, హవాలాలను ఆశ్రయిస్తున్నారు. నగరంలో ఉన్న ఏజెంట్లకు డబ్బు అప్పగించే వ్యాపారులు, అది చేరాల్సిన వ్యక్తి వివరాలు చెప్పి కమీషన్‌ ఇస్తే చాలు. గంటలోపే డెలివరీ అయిపోతుంది. ఇక్కడకు రావాలన్నా ఇదే పంథా కొనసాగుతోంది. ఈ విధానమే తమకు సురక్షితమని భావిస్తున్న స్మగ్లర్లు, వ్యాపారస్తులు దీన్నే అవలంబిస్తున్నారు. నగరంలోని బేగంబజార్‌, పాతబస్తీ, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ రోజూ రూ.కోట్లలో ఈ అక్రమ ద్రవ్యమార్పిడి బిజినెస్‌ నడుస్తోందని పోలీసులే అంగీకరిస్తున్నారు. ప్రతి రూ.లక్షకు కేవలం రూ.300 నుంచి రూ.600 వరకు మాత్రమే కమీషన్‌గా ఉండటం వీరికి కలిసి వస్తోంది. ఏవైనా ఉదంతాలు చోటు చేసుకున్న సందర్భంలో మాత్రమే ఏజెన్సీల రికార్డుల్లోకి ఈ వ్యవహారాలు ఎక్కుతున్నాయి. డ్రగ్స్‌ రవాణా వ్యవహారాల్లో పాత్రధారులు మినహా సూత్రధారులు దొరుకుతున్న సందర్భాలు లేవు.

అన్నీ స్కానింగ్‌ సాధ్యం కాదు
కొరియర్‌ పార్శిల్స్‌ ద్వారా డ్రగ్స్‌, పేలుడు పదార్థాలు, డబ్బు, నగలు, మానవ అవయవాలు, మత్తు పదార్థాలు తదితరాలను పార్శిల్‌ చేయడంపై పూర్తి నిషేధం ఉంది. అయినా పట్టుబడిన నిందితులు చెప్పిన వివరాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం అనేక కొరియర్స్‌ ద్వారా ఈ రవాణా జరుగుతోంది. ఇలాంటి అంశాల్లో పూర్తి వివరాలను వెలికితీసే అవకాశం పోలీసు, ఏజెన్సీలకు ఉండట్లేదు. ఎయిర్‌కార్గో ద్వారా రవాణా అయ్యే ప్రతి పార్శిల్‌ను స్కానింగ్‌ చేయడం, క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యం కాదు. సంబంధిత విభాగంలో ఆ సాంకేతిక పరిజ్ఞానం, మానవవనరులు లేవు. నిరంతర నిఘా, ప్రతి కేసులోనూ మూలాలను అన్వేషించడం ద్వారానే ఇలాంటి వాటికి చెక్‌ చెప్పగలం.
– శ్రీనివాస్‌, కస్టమ్స్‌ విభాగం మాజీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement