మహబూబాబాద్‌లోకే గార్ల, బయ్యారం | garla, bayyarm going to mahabad dist | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్‌లోకే గార్ల, బయ్యారం

Published Wed, Aug 17 2016 10:12 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

మహబూబాబాద్‌లోకే గార్ల, బయ్యారం - Sakshi

మహబూబాబాద్‌లోకే గార్ల, బయ్యారం

  •  రెండు జిల్లాల ప్రజాప్రతినిధులకు సమాచారం
  • ఖమ్మం: గార్ల, బయ్యారం మండలాలు ఇక అటే వెళ్లనున్నాయి.. కొత్త జిల్లాల ప్రతిపాదనతో ఖమ్మంలోని రెండు మండలాలు మహబూబాబాద్‌లోకి వెళతాయన్న చర్చ జోరుగా సాగింది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సమీక్ష సమావేశంలో ప్రతిపాదిత డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో వీటిని మహబూబాబాద్‌ జిల్లాలోనే చూపించారు. వరంగల్‌ పరిధిలోని మహబూబాబాద్‌ను జిల్లాగా చేయాలని అక్కడి ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేయడంతో ఈ రెండు మండలాలు ప్రస్తావన తెరపైకి వచ్చింది.

    ఇవి ఖమ్మం, కొత్తగూడెంతో పోలిస్తే మహబూబాబాద్‌కే సమీపంలో ఉన్నాయి. పాలనా సౌలభ్యం దష్ట్యా ఇటు కలిపితేనే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వానికి వరంగల్‌ జిల్లా అధికారులు పంపిన నివేదికలోనూ పేర్కొన్నారు. మహబూబాబాద్‌కు బయ్యారం 13, గార్ల 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇల్లెందు నియోజకవర్గమంతా కొత్తగూడెం లేదా ఖమ్మం జిల్లాలోనే ఉండాలని, ఇల్లెందును రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ప్రకటించాలని గిరిజన సంఘాలు ఆందోళనలు చేశాయి. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో జిల్లా నుంచి ఏ మండలాన్ని మహబూబాబాద్‌ జిల్లాలో కలపొద్దని మంత్రివర్గఉపసంఘం ఎదుట తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.  
    విలువైన ఖనిజాలు కోల్పోతాం..
    బయ్యారం మండలంలో 36,998 మంది, గార్లలో 2,587 మంది జనాభా ఉన్నారు. విస్తీర్ణంలో బయ్యారం 348, గార్ల 126 చదరపు కిలోమీటర్లు ఉంది. మహబూబాబాద్‌ జిల్లాలోకి వచ్చే మండలాల్లో ఆ జిల్లాలోని కొత్తగూడ తర్వాత బయ్యారం అత్యధికంగా విస్తీర్ణం ఉన్న మండలం అవుతుంది. ఖమ్మం జిల్లాలోనూ బయ్యారం విస్తీర్ణం దష్ట్యా 13వ స్థానంలో ఉంది. ప్రధానమైన అటవీ ప్రాంతంతో పాటు విలువైన ఇనుప ఖనిజం, డోలమైట్, సున్నపురాయి, బొగ్గు వంటి ఖనిజాలున్నాయి.

    ప్రపంచంలోనే అరుదైన తోరియం ఖనిజం ఇక్కడ ఉన్నట్లు ఇటీవల మైనింగ్‌ అధికారులు సర్వేలో తేల్చారు. అణుధార్మిక కేంద్రాల్లో ఈ ఖనిజాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) సర్వే చేసింది. బయ్యారంలో ఉన్న ఇనుప ఖనిజం నాణ్యతపరంగా మేలిమైనది కావడంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం కూడా పలుమార్లు ప్రకటిచింది. గార్లలో బైరటీస్‌తో పాటు డొలమైట్‌ ఖనిజం భూమిలో నిక్షిప్తమైంది. ఈ రెండు మండలాలు మహబూబాబాద్‌లోకి వెళ్తే విలువైన ఈ ఖనిజాలను ఖమ్మం జిల్లా కోల్పోనుంది.
    అఖిలపక్ష భేటీకి జిల్లా నేతలు..
    అఖిలపక్ష పార్టీల నేతలతో ఈ నెల 20న కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించనున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులకు ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానం పంపించింది. అఖిలపక్ష భేటీæ అనంతరం ఈ రెండు మండలాలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఎదురుచూస్తుండగా.. ఇవి మహబూబాబాద్‌లోకే వెళుతున్నాయని డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ తుదిరూపులో అటే ఉన్నాయని జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సమాచారం అందినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement