గత్యంతరం లేకనే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాం
Published Sun, Oct 2 2016 12:57 AM | Last Updated on Mon, Aug 20 2018 4:17 PM
ఎంజీఎం : పేద ప్రజలకు సేవలందిస్తున్న నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆరోగ్య సేవలను నిలిపివేయడం జరిగిందని ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధి డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి తెలిపారు. శనివారం నగరంలోని ఐఎంఎ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మొండివైఖరితో ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు దినదిన గండగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ మే నెలలో సేవలు నిలిపివేయగా రూ.434 కోట్లకు గాను 100 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రభుత్వం చేతు లు దులుపుకుందున్నారు. అప్పుడు జరిగిన చర్చల్లో వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి నెలవారీగా ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించడంతో పాటు కొద్దిమేర పాత బకాయిలు చెల్లిస్తూ వస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ నాటి నుంచి నేటి వరకు పెండింగ్ బకాయిలతో పాటు నెల వారీ బిల్లులు సైతం చెల్లిం చకుండా నెట్‌వర్క్ ఆస్పత్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో నెట్‌వర్క్ ఆస్పత్రులతో కుదర్చుకున్న ఎంఓ యు తప్పులతడకగా ఉందని, దీనిని మళ్లీ రూపొందించాలని కోరగా ఏడుగురు సభ్యులతో కూడిన ఓ కోర్ కమిటీని నియమించారని తెలిపారు.
గడిచిన మూడు నెలల్లో ఆ కమిటీ కేవలం ఒక్కసారి మాత్రమే సమావేశం నిర్వహించిందన్నారు. కనీసం ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్ కాపీనీ కూడ తమకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆరోగ్య శ్రీ ప్యాకేజీలను ధరలను సైతం పెంచాల్సి ఉందన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు జిల్లాలోని 27 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీసేవలను నిలిపివేస్తామన్నారు. సమావేశంలో ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి, సుధీర్, వొద్దిరాజు రాకేశ్, బొచ్చు రాధకృష్ణ నాగర్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement