తల్లి వైద్యం కోసం బాలిక భిక్షాటన
♦ దారితప్పి బేగంపేట రైల్వేస్టేషన్‌లో ప్రత్యక్షం
♦ తల్లిదండ్రులకు అప్పగింత
కర్నూలు(హాస్పిటల్): కన్నతల్లి ఆసుపత్రిలో అనారోగ్యంతో తల్లడిల్లుతుండటాన్ని చూడలేకపోయిన ఓ ఎనిమిదేళ్ల బాలిక భిక్షాటన చేసి డబ్బు సంపాదించాలని బయలుదేరి తప్పిపోయింది. చివరకు రైల్వే పోలీసులు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారుల సహకారంతో తల్లిదండ్రుల చెంతకు చేరింది. వివరాలిలా ఉన్నాయి. మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన బసవ, రాములమ్మలు వ్యవసాయ కూలీలు. రాములమ్మ 8వ నెల గర్భంతో ఉండటంతో మంత్రాలయం ఆసుపత్రికి వెళ్లింది. ఆమెకు రక్తం తక్కువగా ఉండడంతో ఆసుపత్రిలో చేరింది.
తల్లి అనారోగ్యంతో ఉందని, తాను ఎలాగైనా డబ్బు తెచ్చి ఆమెను బాగు చేసుకోవాలని కూతురు సుజాత(8) భావించింది. ఈ మేరకు భిక్షాటన చేస్తూ మంత్రాలయం రైల్వేస్టేషన్‌లో రైలెక్కింది. అలా వెళ్లిన ఆమె చివరకు బేగంపేట రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. గత 21న అక్కడి రైల్వేస్టేషన్ పోలీసులు పాపను గుర్తించి అదుపులో తీసుకున్నారు. బాలిక వివరాల మేరకు బుధవారం రాత్రి కర్నూలు తీసుకొచ్చి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. గురువారం ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, ఐసీపీఎస్ అధికారి శారదలు సంయుక్తంగా తల్లిదండ్రులకు బాలికను అప్పగించారు.