ఆమె... దశాబ్దం తర్వాత అతడయ్యాడు
ముస్తాబాద్: అందమైన చిరునవ్వు.. అంతే అందమైన పేరు.. మానస. అందరు పిల్లల్లాగే పెరిగి పెద్దవుతున్న కొద్దీ మానసలో కొన్ని అసహజ మార్పులు..! ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా... ఆమెలో పురుష లక్షణాలున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ వైద్యుడు చింతోజు శంకర్‌ను సంప్రదించగా ఆయన శస్త్రచికిత్స నిర్వహించి మానసను మనోజ్‌గా మార్చారు. వివరాలివీ.. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గవ్వల రాజు, లావణ్య కూతురు మానస(11). వీరు ఉపాధి కోసం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో స్థిరపడ్డారు. మానస అక్కడే ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. ఆమె పుట్టినప్పుడు కొంత పురుష అవయవాలతో జన్మించగా.. దానిని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. మానస జన్మించినప్పుడు వృషణాలు పొత్తికడుపులో ఉండడంతో గమనించలేదు. స్త్రీ మర్మావయాలు కొంతమేరకు ఉండడంతో ఆమ్మాయిగానే భావించారు. అందరు ఆడపిల్లల్లాగే పెంచారు.
ఇటీవల ఆమెలో పురుష లక్షణాలు కనిపిస్తుండటంతో గమనించిన తల్లిదండ్రులు కరీంనగర్, హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. మానసలో పురుష లక్షణాలు ఉన్నాయని, గర్భాశయం, అండాశయం లేవని వైద్యులు తేల్చారు. కానీ, శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. రెండు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లికి చెందిన కొర్రె వేణుకు స్త్రీ, పురుష జననాంగాలు ఉండగా, జిల్లాలోని ముస్తాబాద్‌లోని పీపుల్స్ హాస్పిటల్‌లో డాక్టర్ చింతోజు శంకర్ శస్త్రచికిత్స చేసి సరిచేశారని ‘సాక్షి’ లో వచ్చిన కథనం చూసిన మానస తండ్రి గవ్వల రాజు... డాక్టర్ శంకర్‌ను సంప్రదించాడు. బైలాటరల్ ఆర్కిటోపెక్సీగా పిలిచే అరుదైన కేసు అని డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. గర్భంలో ఉన్నప్పుడు వైక్రోమోజోం సరిగా ఎదగకపోవడంతో జెనెటిక్ సమస్య వచ్చిందన్నారు. మానసలో టెస్టోస్టిరాన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, శస్త్రచికిత్స ద్వారా మూత్రనాళం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లోనే కోలుకుంటుందని తెలిపారు. శస్త్రచికిత్సతో మానస జీవితం మారిపోయిందని, ఆమెను మనోజ్‌గా పిలుచుకుంటామని తల్లిదండ్రులు పేర్కొన్నారు.