జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి
– జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు
కర్నూలు(టౌన్): జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా సమితి పిలుపు మేరకు యూనియన్ నాయకులు కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జర్నలిస్టులకు ఇళ్లస్థలాలతోపాటు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు అవుతున్న ఇంత వరకు ఇళ్లు కాని, స్థలాలు కాని ఇవ్వలేదన్నారు. కర్నూలులో జగన్నాథగట్టుపై జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈ.ఎస్.రాజు, కోశాధికారి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.