రమణీయం.. ప్రహ్లాదవరదుడి రథోత్సవం
రమణీయం.. ప్రహ్లాదవరదుడి రథోత్సవం
Published Sun, Mar 12 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM
– గోవిందా నామస్మరణతో మార్మోగిన అహోబిలం
– ఆకట్టుకున్న సాంస్కృతిక, కార్యక్రమాలు
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో శ్రీలక్ష్మీనృసింహుని ర«థోత్సవం రమణీయంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజు ఆదివారం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరదస్వామి రథోత్సవం అంగరంగా వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో అహోబిల ప్రాంతం మార్మోగింది. ముందుగా నిత్య పూజల్లో భాగంగా శ్రీ ప్రహ్లదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ముస్తాబు చేసి కొలువుంచారు. అర్చకులు, వేదపండితులు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈఓ మల్లికార్జునప్రసాదు, ప్రధాన అర్చకులు వేణుగోపాలన్, అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువుంచి అహోబిల మఠం వద్ద పీఠాధిపతి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం రథం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.
అప్పటికే వివిధ రకాల పుష్పాలతో అలకంరించిన రథంపై స్వామి, అమ్మవార్లను కొలువుంచారు. అహోబిల మఠం 46వ జియర్ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్, వేదపండితులు, అర్చకులు రథాంగ పూజలు నిర్వహించారు. ఆచార్లు కొబ్బరికాయ సమర్పించి గుమ్మడికాయతో హారతిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఉత్సవం ఎదుట భక్తి పారవశ్యంతో నిర్వహించిన కోలాటాలు, హరి భజనలు, డప్పుల వాయిద్యాలు, భాజాభజంత్రీల మంగళ వాయిద్యాల మధ్య రథోత్సవం ప్రారంభమైంది. రథంలో విహరిస్తున్న స్వామిని భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, ప్రత్యేక పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించారు. రథోత్సవంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన నాయకుడు నాని తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు, ఆయగాళ్లకు సన్మానం
రథోత్సవం కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కారకులైన అధికారులు, ఆయగాళ్లను సన్మానించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పీఠధిపతి శ్రీరంగనాథ యంత్రీంద్రమహాదేశికన్‌ను ముద్రకర్త వేణుగోపాలణ్ సన్మానించి స్వామివారి ఆశీర్వాదం అందజేశారు. ముద్రకర్తకు పీఠధిపతి ఆశ్వీరాదం అందజేశారు. అనంతరం ముద్రకర్త, మణియార్ సౌమ్యానారన్‌కు, అర్చకులు, ఈఓ, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీ రాజ్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, బోయిలు, భజంత్రీలను పూలమాలలు వేసి, శేషవస్త్రం కప్పి సన్మానించారు.
అహోబిలంలో నేడు:
అహోబిల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం దిగువ అహోబిలంలో ఉదయం ఉత్సవం, తీర్థవారి చక్రస్నానం, సాయంత్రం ద్వాదశారాధనం, పుష్పయాగం, అనంతరం రాత్రి గరుడోత్సవం, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతాయి.
Advertisement
Advertisement