లోక కల్యాణమే పీఠాల ధ్యేయం
మనిషిని ‘మనీషి’ చేసేది పీఠాధిపతులే
గాడ్ 81వ జన్మదిన వేడుకల్లో ‘మండలి’
రాయవరం (మండపేట) : మనిషిలో మానవత్వాన్ని మేల్కొలిపి మనిషిని ‘మనీషి’గా తీర్చిదిద్దేది పీఠాధిపతులేనని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) 81వ జన్మదిన వేడుకలను గురువారం పీఠంలో ఘనంగా నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ జీఆర్‌ఎస్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ లోక కల్యాణమే పీఠాల లక్ష్యమన్నారు. గాడ్ సందేశాన్ని జీవితాలకు అన్వయించుకుని మంచి మార్గంలో నడవాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ రావులపాటి సీతారామారావు, పేథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కేఎస్ రత్నాకర్ తదితరులు మాట్లాడుతూ విజయదుర్గా పీఠం ఆధ్యాత్మికతకు కేంద్రబిందువుగా భాసిల్లుతోందన్నారు. పీఠంలో ఆత్మీయత, అనురాగం, ఆప్యాయతలు లభిస్తాయన్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, వేదగణిత సంస్థ నిర్వాహకులు డాక్టర్ రేమెళ్ల అవధాని, దేవాదాయ శాఖ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ చిలకపాటి రాఘవాచార్యులు, ‘సాగరఘోష’ కవి గరికపాటి నరసింహారావు, టీటీడీ అవధాన చక్రవర్తి డాక్టర్ మేడసాని మోహన్, టీటీడీ ప్రెస్, ప్రింటింగ్ శాఖాధిపతి ప్రయాగ రామకృష్ణ, టీటీడీ కళ్యాణమస్తు ప్రోగ్రామ్ పండితుడు డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు మాట్లాడారు. పీఠం తరఫున ఇచ్చే ఉత్తమ ఆదర్శ దంపతుల పురస్కారాన్ని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సోదరుడు పీవీ మనోహరరావు దంపతులకు అందజేశారు. సభలో వేదపండితుడు డాక్టర్ రేమెళ్ల అవధాని రచించిన ‘సంక్షిప్త శబ్దవేగం’ పుస్తకాన్ని ఐవైఆర్ కృష్ణారావు ఆవిష్కరించారు. సాహితీవేత్త యర్రాప్రగడ రామకృష్ణ, పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు సభానిర్వహణ చేశారు.
ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి..
ప్రతి ఒక్కరూ ధర్మ, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, మంచి ఆలోచనలు చేసే వారికి దైవకృప తోడుగా ఉంటుందని పీఠాధిపతి గాడ్ అన్నారు. భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ మంచి పనులు చేసేవారికి అమ్మదయ ఎన్నడూ ఉంటుందన్నారు. లోక కళ్యాణం కోసం నిత్యం పీఠంలో అనేక హోమాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు..
జిల్లా నలుమూలల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పీఠంలోని విజయదుర్గా అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారిని నయనానందకరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు గాడ్‌కు పాదపూజ చేశారు. కార్యక్రమంలో వస్త్రవ్యాపారి తుమ్మిడి రామ్‌కుమార్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి అసోసియేట్ రీజనల్ కో ఆర్డినేటర్ కందర్ప హనుమాన్, దేవాదాయశాఖ ఏసీ రమేష్‌బాబు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. అనపర్తి సీఐ శీలబోయిన రాంబాబు పర్యవేక్షణలో రాయవరం, అనపర్తి, మండపేట, రామచంద్రపురం ఎస్సైలు వెలుగుల సురేష్, కిషోర్‌బాబు, నసీరుల్లా, నాగరాజు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. పీఠంలో భక్తులకు పీఠం పీఆర్వో వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు.