ఎక్స్‌ప్రెస్ రైల్లో చోరీ
Published Fri, Jul 29 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
నరసరావుపేటటౌన్: ఎక్స్‌ప్రెస్ రైల్లో బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. రైల్వేపోలీసుల కథనం ప్రకారం నంద్యాలకు చెందిన జి.రత్నకుమారి గుడివాడలో జరిగే ఆమె తమ్ముడి నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు గురువారం రాత్రి నంద్యాలలో కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటలకు రైలు నరసరావుపేట స్టేషన్‌లో ఆగింది. రైలు బయలుదేరే సమయంలో బ్యాగ్ చూసుకోగా వెనుకభాగం బ్లేడ్‌తో కత్తిరించి ఉండటాన్ని గమనించింది. అందులో ఉండాల్సిన సుమారు మూడు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన రత్నకుమారి కేకలు వేస్తూ చైన్ లాగగా రైలు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సత్యన్నారాయణ , సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని బాధితురాలిని విషయం అడిగి తెలుసుకొన్నారు. మార్కాపురంలో రైలెక్కిన ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా సంచరిస్తూ నరసరావుపేటలో దిగినట్లుగా ఆమె తెలిపింది. దీంతో ఆ ఇద్దరు మహిళలకోసం పోలీసులు రైల్లో గాలింపు చర్యలు చేపట్టగా ఎటువంటి ఫలితం దక్కలేదు. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement