వ్యాపారం.. పుష్కలం
– 12 రోజులు.. అరకోటి వ్యాపారం
– జోరుగా గంగమ్మ పూజా సామగ్రి అమ్మకాలు
– దాదాపు 200 మంది పొదుపు మహిళలకు ఉపాధి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కృష్ణా పుష్కరాల్లో గంగమ్మ పూజా సామగ్రి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పుష్కరం 12 రోజుల్లో దాదాపు అరకోటి వ్యాపారం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీశైలంలోనే పాతాళగంగ, లింగాలగట్టు పుష్కర స్నాన ఘాట్లలో ప్రతి రోజు దాదాపు 10 వేల మంది భక్తులు గంగమ్మకు పూజలు చేసుకుంటున్నారు. పూజా సామగ్రిలో టెంకాయ, చిన్న చాటా, రెండు రకాల పూలు, బిల్వపత్రి, ఒక నూనెలో అద్దిన ఒత్తి ఉంటుంది. వీటి వెలను రూ.40గా నిర్ణయించారు. ప్రతి రోజు దాదాపు 10 వేల మంది భక్తులు గంగమ్మకు పూజలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు రూ. 4 లక్షల వ్యాపారం సాగుతోంది. ఇలా పుష్కరాల్లో 12 రోజుల్లో రూ. 48 లక్షల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎనిమిది రోజులు ముగిశాయి. చివరి రెండు రోజుల్లోనూ ఎక్కువగా మహిళలు స్నానం చేసే అవకాశం ఉంది. అప్పుడు వ్యాపారంలో వృద్ధి ఉండే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
సాగానికిపైగానే ఆదాయం:
పుష్కారాల్లో స్థానికంగా ఉండే పొదుపు మహిళలతో గంగమ్మ పూజా సామగ్రి అమ్మించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా దాదాపు 200 మంది పొదుపు మహిళలు వ్యాపారాలు పెట్టుకున్నారు. కాగా, పూజా సామగ్రిలో ఒక్క టెంకాయ తప్పా మిగతా వస్తువులన్నీ స్థానికంగా అతి తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. అంతేకాక ఒక్కసారి గంగమ్మ పూజకు వదిలిన చాటా, పూలు, పత్రి తదితర వస్తువులను గజ ఈతగాళ్లతో మళ్లీ తెప్పించుకొని వాటినే వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొదుపు మహిళలకు సగానికిపైగానే వ్యాపారం జరిగిన దానిలో లాభం ఉండే అవకాశం ఉంది. అంటే ఒక్కో మహిళా దాదాపుగా ఈ పన్నెండురోజుల్లో 15 వేలకు తక్కువ కాకుండా లాభం పొందే అవకాశం ఉంది.