ప్రచారంలో దూసుకుపోతున్న గోపాల్‌రెడ్డి
ప్రచారంలో దూసుకుపోతున్న గోపాల్‌రెడ్డి
Published Wed, Mar 1 2017 11:45 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
– ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం
– సీమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తున్న వైనం
– కలిసివస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ఐక్యత
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో 8 రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో పోటీ చేసిన అభ్యర్థులు ప్రచారంపై దృష్టిసారించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎన్‌జీఓ, జేఏసీ చైర్మన్ వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రచారంలో దూసుకు పోతున్నారు. తెలుగుదేశం హయాంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టభద్రుల ముందు ఉంచుతుండడంతో మంచి స్పందన లభిస్తోంది. సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల అమలుపై నిర్లక్ష్యం వహించడంతో యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది. అది వైఎస్‌ఆర్‌సీపీకి కలిసివచ్చే అంశమని పరిశీలకులు భావిస్తున్నారు.
పశ్చిమ బరిలో ప్రథమ స్థానం...
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 25 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వెన్నపూస వేణుగోపాల్‌రెడ్డి, టీడీపీ నుంచి కేజేరెడ్డి, పీడీఎఫ్ నుంచి గేయానంద్ ప్రధానంగా ఉన్నారు. వీరి ముగ్గురి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు గోపాల్‌రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన ప్రచారంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రచారం...
ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం.. రాయలసీమలోని పెండింగ్‌లో సాగు, తాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. అంతేకాక పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధిని కల్పిస్తామని సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం సీమలో హైకోర్టు సహా కొన్ని ముఖ్యమైన సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రజల అభ్యర్థనలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి.. రాజధాని, హైకోర్టుతో సహా అన్ని కోస్తాకు తరలించడంతో యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది.
నిరుద్యోగ భృతి ఎన్నికల స్టంట్....
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వ ప్రకటించడం ఎన్నికల స్టంట్ అన్ని పట్టభద్రులు పేర్కొంటున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏనాడో అమలు చేసేదని పేర్కొంటున్నారు. ఇది కేవలం ఎన్నికల కోసమేనని తాము పూర్తిగా నమ్ముతున్నామని పేర్కొంటున్నారు. మరోసారి టీడీపీ నమ్మి మోసపోయే స్థితిలో లేమని నిరుద్యోగులు సమాధానం ఇస్తున్నారు.
తప్పుడు సర్వే..
రాష్ట్ర కార్మిక శాఖమంత్రి, కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు.. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి కేజేరెడ్డి ఓడిపోతారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అంతేకాక అయనకు సహకరించేది లేదని బహిరంగంగానే మూడు జిల్లాలోని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. అయినా పట్టభద్రులను మోసం చేయడానికి ఓ తప్పుడు సర్వేతో తాను గెలుపొందుతానని ప్రచారం చేయించారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులే బయటపెట్టారు.
Advertisement