ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గోరంట్ల గ్రామస్తులు
కోడుమూరు రూరల్ : మండలంలోని గోరంట్ల హంద్రీనది నుంచి ఇసుక తరలించుకుపోతున్న ట్రాక్టర్లను బుధవారం గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. సుమారు మూడు గంటల పాటు ట్రాక్టర్లను హంద్రీనదిలో నుంచి వెళ్లనీయకుండా అక్కడే నిలిపేశారు. చివరకు ఇసుక తరలిస్తున్న 5ట్రాక్టర్లను కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో గ్రామస్తులు అప్పజెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పరశురాముడు, తెల్లన్న, ఈశ్వర్‌రెడ్డి, రాముడు, మాదన్న, భాస్కర్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిత్యం గోరంట్ల హంద్రీనది నుంచి వందలాది ట్రాక్టర్ల ఇసుకను తరలించుకుపోతున్నా అడిగే నాథుడే లేడన్నారు. ఇసుక తరలింపుతో హంద్రీనదిలో నీటి ఊటలు తగ్గిపోవడంతో పాటు, గ్రామానికి తాగునీటిని సరఫరా చేసే పైపులైన్లు, పొలాలకు హంద్రీ నుంచి వేసుకున్న పైపులైన్లు ధ్వంసమైపోతున్నాయని వాపోయారు. అనంతరం కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో ఇసుక తరలిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఐ మహేష్‌కుమార్‌కు గ్రామస్తులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే రెవెన్యూ అధికారులకు ఇసుక రవాణాను అరికట్టాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.