ఇసుకాసురులపై అధికారుల కొరడా
మొయినాబాద్: ఇసుకాసురులపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఓ ట్రాక్టర్‌ను సీజ్ చేసి జరిమానా విధించారు. ఇటీవల పత్రికల్లో వస్తున్న కథనాలకు అధికారులు స్పందించారు. శనివారం ఉదయం 6 గంటలకు తహసీల్దార్ గంగాధర్, రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో కలిసి మండల పరిధిలోని వెంకటాపూర్, కేతిరెడ్డిపల్లి, నక్కలపల్లి పరిసరాల్లోని ఈసీ వాగులో దాడులు నిర్వహించారు. ఇసుక తీయడంతో ఈసీ వాగులో ఏర్పడిన గోతులను చూసి వారు ఆశ్చర్యపోయారు. షాబాద్ మండలం సోలిసేట్ గ్రామానికి చెందిన గౌస్ ట్రాక్టర్ ఇసుక నింపుతుండగా అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ట్రాక్టర్ యజమానికి రూ. 5 వేలు జరిమానా విధించారు. అనంతరం కేతిరెడ్డిపల్లి, నక్కలపల్లి గ్రామాల్లో ఉన్న ఇసుక డంప్‌లను అధికారులు గుర్తించారు. ఇసుక నిల్వ ఉంచిన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు. చిన్నమంగళారం సమీపంలోని మూసీ వాగులో దాడి చేయగా ఎవరూ పట్టుబడలేదు. దాడుల్లో డిప్యూటీ తహసీల్దార్ జగదీశ్వర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, ఆర్‌ఐ రాజు, వీఆర్‌ఓలు సుదర్శన్, మల్లయ్య, కృష్ణ, శంకరయ్య, విష్ణు, అఖిల్ హైమద్, పోలీసులు ఉన్నారు.