విలేకరుల సమావేశం మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా
హోదాపై బాబు మొండిచేయి
Published Sat, Jul 30 2016 11:50 PM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM
–నగరి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా ధ్వజం
తిరుపతి మంగళం:
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఆ నాడు గొప్పలు చెప్పిన నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు రాష్ట్రానికి హోదా కల్పనలో మొండి చెయ్యి చూపారని నగిరి ఎమెల్యే ఆర్‌కె. రోజా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి చెన్నారెడ్డికాలనీలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న బిజెపి, టీడీపీలు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి హోదా రాకుంటే సర్వం కోల్పోతామని తెలిసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. పేదల గుండెల్లో మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఎప్పటికీ చిరస్మరణీయుడుగానే నిలచిపోతారని రోజా వ్యాఖ్యానించారు. విజయవాడలోని పోలీస్‌కంట్రోల్ రూం సమీపంలో వైఎస్ విగ్రహాన్ని శుక్రవారం అర్ధరాత్రి కూలదోయడం బాధాకరమన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో గానీ, ప్రస్తుత రెండేళ్ల పాలనలో ప్రజలకు ఏమైనా చేశావా? చంద్రబాబూ అని ప్రశ్నించారు. పుష్కరాల పేరుతో దేవుళ్ల విగ్రహాలు, ఆలయాలనే కూల్చేసిన చంద్రబాబుకు వైఎస్సార్ విగ్రహాం ఓ లెక్కా అని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అరిష్టాన్ని తెచ్చిపెడుతున్నాడన్నారు. వంద తప్పులు చేసిన శిశుపాలుడు గతే చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు.
Advertisement
Advertisement