
నిధులున్నా ఖర్చు పెట్టరా?
♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కన్పించడం లేదు
♦ జిల్లాలో ఎక్కడా సరైన వైద్య సేవలు అందట్లేదు
♦ ఇకపై నిర్లిప్తతను ఎంతమాత్రం సహించేది లేదు
♦ నిఘా, పర్యవేక్షణ సమావేశంలో ఎమ్మెల్యేల మండిపాటు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైద్య, ఆరోగ్య విభాగంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోందని నిఘా, పర్యవేక్షణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. నిధులున్నా సౌకర్యాల కల్పనకు ఎందుకు వాడుకోవడం లేదని నిలదీసింది. వైద్యుల పనితీరుపైనా మండి పడింది. వైద్యులు లేనిచోట ఆస్పత్రులెందుకంటూ వైద్య శాఖను నిలదీసింది. బుధవారం రాజేంద్రనగర్‌లోని టీఎస్ ఐపార్డ్‌లో వైద్య, ఆరోగ్య శాఖ నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కలెక్టర్ రఘునందన్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యశాఖ పనితీరును సమీక్షిస్తూ ఎమ్మెల్యేలు పైవిధంగా స్పందించారు.
వారంతా ఎక్కడికెళ్తారు?
జిల్లాలో చాలాచోట్ల డాక్టర్లు విధులకు హాజరు కావడం లేదంటూ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, సంజీవరావు, కాలె యాదయ్య సమావేశంలో ప్రస్తావించారు. మేడ్చల్ ఆస్పత్రిలో డాక్టర్లెప్పుడూ కనిపించరని, అలాంటప్పుడు అక్కడ ఆస్పత్రి ఎందుకంటూ సుధీర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండాపూర్ ఆస్పత్రుల్లో సైతం ఇదే సమస్య ఉందంటూ ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. విధులకు రాకుండా డాక్టర్లు ఎక్కడికెళ్తున్నారంటూ డీఎంహెచ్‌ఓను నిలదీయడంతో ఆయన పెదవి విప్పలేదు. పర్యవేక్షణ గాలికొదిలేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సభ్యులు అన్నారు. వికారాబాద్ ఆస్పత్రిలో వైద్య పరికరాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకపోవడంతో తప్పుపట్టిపోతున్నాయంటూ ఎమ్మెల్యే సంజీవరావు సభకు వివరించారు. రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో ఆస్పత్రి నిర్మించినప్పటికీ వినియోగించుకోకపోవడంపై ఆయన అభ్యంతరం చెప్పారు. లక్షలు ఖర్చుచేసి భవనాలు నిర్మించినా.. వాటిని ఉపయోగించుకోకుండా ప్రజాధనాన్ని దుబారా చేయడం తగద న్నారు. చేవెళ్ల ఆస్పత్రుల్లో డాక్టర్లు అధికంగా డుమ్మాలు కొడతారన్నారు.
రెండేళ్ల తర్వాత గుర్తొచ్చిందా..!
వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి నిఘా, పర్యవేక్షణ సమావేశాన్ని రెండేళ్లుగా ఎందుకు నిర్వహించలేదంటూ ఎమ్మెల్యేలు డీఎంహెచ్‌ఓపై అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలు క్రమం తప్పకుండా జరిగితే పనులు సక్రమంగా సాగుతాయన్నారు. రెండేళ్ల తర్వాత జరిగిన తొలి సమావేశం కావడంతో సర్దుకుపోతున్నామని.. ఇకపై నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేదిలేదని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని కమిటీ చైర్మన్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ పనితీరు మెరుగయ్యేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించి అమలు చేద్దామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి సంస్థ, వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్తంగా సదరం క్యాంపులు నిర్వహిస్తామన్నారు. కమిటీ సమావేశాలు రెగ్యులర్‌గా నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌ఓ సుభాష్‌చంద్రబోస్, డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, డీపీఓ అరుణ, డీఐఓ గణేష్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.