ట్రయినింగ్ నీడ్స్ ఐడెంటిఫికేషన్ టెస్టు (టీఎన్‌ఐటీ) పేరిట పనితీరు సామర్ధ్యాలను అంచనా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ తలపెట్టిన పరీక్షలపై టీచర్లనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని ప్రధాన సంఘాలనుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రకటనలు వెలువడుతున్నాయి. యూటీఎఫ్, పీఆర్‌టీయూ, ఎస్టీయూ సహ పలుసంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బుధవారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. జాతీయ సర్వేలలో వెనుకబడ్డామని టీచర్లకు ఆన్‌లైన్ పరీక్ష పెట్టాలనుకోవడం సరికాదని యూటీఎఫ్ అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా సెక్షన్‌కు 60 మంది విద్యార్ధులను పెట్టి స్కూళ్లు నడుపుతూ సీసీఈ మోడల్ ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు సర్వేల్లో వెనుకబడ్డామని టీచర్లను బాధ్యులను చేయడమేమిటన్నారు. ప్రభుత్వ లోపాన్ని టీచర్లపై నెట్టడానికే ఈ పరీక్షలన్నారు. ఇప్పటికే పలు సబ్జెక్టులకు, టీచర్లు లేరని, టెలికాన్ఫరెన్సు ద్వారా నిర్వహించే ట్రయినింగ్‌లతో ఫలితం లేదని చెప్పారు. అనేక మంది టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం అంతంతమాత్రమేనని, ఈ సమయంలో ఏకంగా ఆన్‌లైన్లో పరీక్ష పెట్టడం వారికి నష్టం కలిగిస్తుందన్నారు. పైగా రూ.300 చొప్పున ఫీజు వసూలు చేయడం దారుణమని పేర్కొన్నారు. పరీక్ష ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, బోధనా పద్ధతులపై నేరుగా శిక్షణ ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
ఆ ఉత్తర్వులు ఉపసంహరించాల్సిందే:ఎస్టీయూ
టీచర్లకు పరీక్షలకోసం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని ఫ్యాప్టో నేతలు కత్తినర్సింహారెడ్డి, పాండురంగవరప్రసాదరావు, హృదయరాజు, నారాయణరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. టీచర్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలన్నదానికి కోట్లు ఖర్చు పెట్టి పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు. ఆయా సబ్జెక్టు ప్రతినిధులతో, టీచర్లతో వెబ్‌సైట్ ద్వారా అభిప్రాయాలు తీసుకొని శిక్షణాంశాలను నిర్ధారించవచ్చని సూచించారు. రూ.300 ఫీజు సరికాదన్నారు. పరీక్షల పేరుతో టీచర్లకు శిక్ష వేయడాన్ని వ్యతిరేకిస్తామన్నారు. ముందు ఖాళీగా ఉన్న వేలాదిపోస్టులను భర్తీచేయాలని, పర్యవేక్షణాధికారులను నియమించడంతోపాటు డీఈడీ, బీఈడీ శిక్షణను పటిష్టంచేయాలని సూచించారు.
టీచర్లకు మళ్లీ పరీక్షా?
టెట్, డీఎస్సీ ద్వారా నియమితులైన టీచర్లకు ప్రతి ఏటా నూతన విద్యావిధానాలపై శిక్షణ ఇస్తున్నారని, ఈ తరుణంలో టీఎన్‌ఐటీ పేరిట పరీక్ష పెట్టడం సరికాదని, వ్యతిరేకిస్తున్నామని పీఆర్టీయూ నేతలు కమలాకర్‌రావు, శ్రీనివాసరాజులు పేర్కొన్నారు. పరీక్షలంటూ టీచర్ల మనోభావాలు దెబ్బతీసేలా ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీలు శ్రీనివాసులు నాయుడు, బచ్చలపుల్లయ్యలతో పాటు తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.