
ఆక్రమణ.. అక్రమార్జన
– ప్రభుత్వ స్థలం కనబడితే కాసులే
– అక్రమాల ఆద్యుడు ‘మునిసిపల్ పెద్ద’
– సొంత పార్టీలోనే వెల్లువెత్తుతున్న విమర్శలు
రాయదుర్గం : రాయదుర్గంలో మునిసిపల్ స్థలాలను కాపాడుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని స్థలాలను ఆక్రమించుకుని, బంకులు ఏర్పాటు చేసి అనధికారికంగా అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న రూములను ఓ ప్రజాప్రతినిధి తన అధీనంలో ఉంచుకుని, బాడుగలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలోని చెరువులు, రెవెన్యూ భూములు, రోడ్లు, డ్రెయినేజీ స్థలాలను సైతం అక్రమార్కులు వదలడం లేదు. గతంలో ఉన్న సామూహిక మరుగుదొడ్ల స్థలాలను సైతం కబ్జాలు చేసి యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. మునిసిపల్ స్థలాల్లో గదులు నిర్మించి పూర్తిస్థాయిలో అద్దెకు ఇవ్వకపోవడం, మరికొన్నిచోట్ల ఖాళీస్థలాల్లో గదులు నిర్మించకపోవడంతో సంస్థ ఆదాయానికి గండిపడుతోంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది.
- పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, మునిసిపల్, దేవాదాయ, అసైన్డ్, వంక పొరంబోకు భూములపై కూడా స్వార్థపరులు కన్నేసి, కొన్నింటిని ఆక్రమించుకోగా, మరికొన్నింటిని చేజిక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.
- బళ్లారి రోడ్డులోని ఇందిరాగాంధి మునిసిపల్ ప్రాథమికోన్నత పాఠశాలల గేటు పక్కన ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలాన్ని ‘మునిసిపల్ పెద్ద’ తన అనుచరులతో ఆక్రమించి, షెడ్డు ఏర్పాటు చేసి రూ.3లక్షలకు గుడ్‌విల్ ఇచ్చారు. స్థలం ఇరుకు కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
- అధికారం అడ్డం పెట్టుకుని అధికారులను లొంగదీసుకుని టీడీపీ నాయకులు అక్రమాలకు తెర తీస్తూనే ఉన్నారు. పాతబస్టాండులో నుంచి కూరగాయల మార్కెట్‌కు వెళ్లడానికి ఉన్న చిన్నపాటి దారిని సైతం ధరలు నిర్ణయించి అప్పణంగా దండుకుంటున్నారు. ఈ దారిలో పూలవ్యాపారం కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్డు నిర్వాహకుడితో ‘మునిసిపల్ పెద్ద’ రూ.5 లక్షలు ఇప్పించుకుని అనుమతి ఇచ్చినట్లు టీడీపీ నాయకులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
- రోడ్డు విస్తరణలో మునిసిపల్ అధికారులు వేసిన మార్కింగ్‌ను మార్పించి, ఓ వ్యక్తికి వత్తాసు పలకడానికి కూడా ‘మునిసిపల్ పెద్ద’ రూ.3లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీ స్థలాలతో పాటు ఆదాయం చేకూరే మార్గాలను అన్వేషించడానికి ఆ ‘పెద్ద’ ఇద్దరు వ్యక్తులను నియమించుకున్నట్లు సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.
షెడ్డు ఏర్పాటు వాస్తవమే
ఇందిరాగాంది మునిసిపల్ పాఠశాల వద్ద షెడ్డు ఏర్పాటు చేసినది వాస్తవమే. టీడీపీ కార్యకర్త అస్లాంకు ఇచ్చాం. అయితే గుడ్‌విల్ తీసుకోలేదు. విద్యార్థులకు అడ్డంగా ఉందంటే దాన్ని తీసివేయిస్తాం. రోడ్డు విస్తరణలో మార్కింగ్ మార్పుల కోసం ఎవరితోనూ డబ్బు తీసుకోలేదు. పూలవ్యాపారి షెడ్డు వేసుకోవడానికి డబ్బుతీసుకున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు.
- వీఎం రాజశేఖర్, మునిసిపల్ చైర్మన్, రాయదుర్గం