జనాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు
జనాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు
Published Mon, Nov 7 2016 7:42 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
గుంటూరు వెస్ట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్నవర్గాలకు సేవకులుగా మారిపోయి, సామాన్యవర్గాల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ పూర్తిగా అమలుచేయాలని, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ బడ్జెట్‌లో కేటాయిస్తున్న ఒక్క రూపాయిలో 99 పైసలు 15 శాతంగా ఉన్న ప్రజలకు చేరుతోందని, కేవలం ఒక్క పైసా మాత్రమే 85 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరుతోందని, ఇది దారుణమైన పరిస్థితి అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా ఒక్కో పర్యాయం మెయిన్ ప్లాన్‌లోకి కలుపుతున్నారని విమర్శించారు.
ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లకు పోరాటాలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్ మాట్లాడుతూ ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల సాధనకు అందరూ ఐక్యంగా పోరాటాలు చేయాలన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌ను పూర్తిగా అమలుచేయడానికి, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల సాధనకు అన్ని సామాజిక శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చాలని కోరారు.
Advertisement