పర్యాటకానికి సెగ | governtment not supported to tourism | Sakshi
Sakshi News home page

పర్యాటకానికి సెగ

Published Mon, Aug 8 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

పర్యాటకానికి సెగ

పర్యాటకానికి సెగ

  • అరొకర నిధులు.. సాగని పనులు
  • ప్రచారం.. ఆర్భాటం
  • ఎక్కడి వేసిన గొంగళి అక్కడే
  • సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే అందమైన నగరంగా తీర్చిదిద్దుతాం.. పర్యాటకరంగంలో అభివద్ధి చేసి ప్రపంచ పటంలో నిలుపుతాం.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా తయారు చేస్తాం.. నిధులెంతైనా ఇస్తాం.. బీచ్‌లను సుందరంగా రూపొందిస్తాం.. ఆ విధంగా ముందుకుపోతాం..’ ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ వేదికలపై వల్లించే ఉపన్యాసం. 
    ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత గత ఏడాది (జులై 9న) విశాఖలోని బీచ్‌ల సుందరీకరణ పేరిట రూ.16 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో ఉత్తరం (నార్త్‌) విభాగం పరిధిలోని బీచ్‌ల అభివద్ధికి 13.49 కోట్లు, దక్షిణ పరిధిలోని పనులకు రూ.1.50 కోట్లు కేటాయించారు. వీటిలో ఉత్తర పరిధిలోని ఆర్కే బీచ్‌ బ్యాలెన్స్‌ పనులకు రూ.2.70 కోట్లు, రుషికొండ బీచ్‌ అభివద్ధికి రూ.3.40 కోట్లు, సాగర్‌నగర్‌ బీచ్‌కు రూ.65 లక్షలు, ఎండాడకు రూ.80 లక్షలు, తొట్లకొండకు రూ.కోటి, మంగమారిపేట బీచ్‌కు రూ.1.50 కోట్లు, భీమిలి బీచ్‌ విస్తరణ పనులకు రూ.3.40 కోట్లు చొప్పున వెచ్చించాల్సి ఉంది. ఇందులో ఆర్కే బీచ్‌ పనులు మాత్రమే పూర్తయ్యాయి. రుషికొండలో ల్యాండ్‌స్కేపింగ్, చిల్డ్రన్‌ పార్కు, యాంఫిథియేటర్, పార్కింగు, షాపులు, ఫుడ్‌కోర్టు, టాయిలెట్లు వంటి పనులు జరగాల్సి ఉంది. ఇక్కడ పనులు పడుతూ లేస్తూ సాగుతున్నాయి. ఒకపక్క నిధుల కొరత, మరోపక్క సముద్రతీరం కోత వెరసి రుషికొండ పనులను సాగనివ్వడం లేదు. ఇక సాగర్‌నగర్, ఎండాడ బీచ్‌ల అభివద్ధికి కేంద్ర అటవీశాఖ అనుమతి పెండింగులో ఉంది. అటు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో తాటాకు గుడిసెలు, పార్కింగ్, టాయిలెట్లు వంటి పనులనే ప్రారంభించలేదు. అలాగే మంగమారిపేటలో టాచ్డ్‌ షెడ్లు, పార్కింగు, కెఫిటేరియా, వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అక్కడ స్థలంపై కోర్టులో స్టే ఉండడంతో అడుగు ముందుకు పడలేదు. భీమిలి బీచ్‌ రోడ్డు అభివద్ధి పనులకు ఆటంకాలు తప్పలేదు. భీమిలి తీరంలో వాటర్‌ స్పోర్ట్స్, పచ్చదనం, షెడ్లు, వగైరాలతో సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇంతలో నాలుగు లైన్ల రోడ్డు ఈ ప్రతిపాదిత బీచ్‌ వైపే రావడంతో అదీ అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పటికే అక్కడ సుమారు రూ.40 లక్షల విలువైన పనులు జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ బీచ్‌ ప్రాజెక్టుకు మంగళం పాడేసే పరిస్థితికి వచ్చింది. మరోవైపు దక్షిణ విభాగం పరిధిలోని యారాడ బీచ్‌లో రూ.కోటిన్నరతో చేపట్టాల్సిన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభమవుతాయో అధికారులకు కూడా తెలియని పరిస్థితి. జిల్లాలోని ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం తీరంలో రూ.కోటిన్నరతో చేపట్టిన అభివద్ధి పనులు అక్టోబర్‌ నాటికి పూర్తవుతాయని పర్యాటక అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులన్నిటికీ సుమారు రూ.16 కోట్లు అవసరం కాగా ఇప్పటిదాకా కేవలం రూ.4 కోట్లు కూడా విడుదల కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలోనూ, నగరంలోనూ ప్రతిష్టాత్మకంగా చేపట్టే పర్యాటక ప్రాజెక్టులు, బీచ్‌ సుందరీకరణ పనుల వేగం నత్తతో పోటీపడుతున్నాయి. ప్రభుత్వం ప్రచారంలో చూపే అట్టహాసం నిధుల విడుదల, వాటికెదురయ్యే అడ్డంకుల పరిష్కారంలో చూపితే సుందర విశాఖ పర్యాటకులను ఆకట్టుకుంటుందని విశాఖ వాసులు అభిప్రాయపడుతున్నారు. 
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement