జాతిపిత.. పదిలం నీ చరిత
-
మహాత్ముని ‘జ్ఞాపకాలు’ పదిలం
-
గాంధీభవన్‌లో ‘గాంధీ’ చిత్రాలు
కాకినాడ :
స్వాతంత్రోద్యమ సమయంలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చేందుకు జాతిపిత మహాత్మగాంధీ కాకినాడ ప్రాంతాన్ని సందర్శించిన జ్ఞాపకాలు ఇప్పటికీ జనం మదిలో చిరస్థాయిగా ఉన్నాయి. 1921 నుంచి 1929 మధ్యలో మూడుసార్లు గాంధీజీ కాకినాడ వచ్చినట్టు చరిత్ర చెబుతోంది. గాంధీజీ ఇక్కడికి వచ్చినప్పటి విషయాలతోపాటు ఆయన బాల్యం నుంచి స్వాతంత్య్రం సాధించే వరకు ఉన్న జీవితఘట్టాలను తెలియజేస్తూ కాకినాడ ప్రాంతంలో గాంధీభవన్ కూడా ఏర్పాటు చేశారు. ఆయనను నిత్యం స్మరించుకునేలా ఓ పార్కుకు గాంధీపార్కుగా, ఓ ప్రాంతానికి గాం«ధీనగర్‌గా అప్పట్లోనే నామకరణం చేశారు.
1921లో తొలిసారిగా వచ్చిన గాంధీ
జాతిపిత మహాత్మాగాంధీ 1921 ప్రాంతంలో కాకినాడ వచ్చారు. ప్రస్తుతం ఎల్విన్‌పేటగా పిలిచే ప్రాంతంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారని, అదే సమయంలో సేవాదళ్ క్యాంప్ కూడా నిర్వహించారని చెబుతుంటారు. ప్రస్తుతం దేవాలయం వీధిగా పిలిచే ప్రాంతంలో పైడా వెంకటనారాయణ నివాసానికి గాంధీజీ వచ్చి అక్కడే ప్రజలను కలుసుకున్నారట. ఆ సందర్భంలోనే కాకినాడ మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న ప్రాంతంలో ఓ రాత్రి గడిపారు.
అక్కడే శాశ్వత భవన నిర్మాణం:
కాకినాడ రాక సందర్భంగా గాంధీజీ బస చేసిన ప్రాంతాన్ని స్వాతంత్య్ర సమరయోధులు కోమండూరి శఠగోపాచారి, డాక్టర్ తనికెళ్ల సత్యనారాయణమూర్తి కొనుగోలు చేశారు. గాంధీజీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ హరిజనోద్ధరణ, మహిళలకు వృత్తి విద్యాకోర్సులు, అక్షరాస్యత కార్యక్రమాల అమలు కోసం 1935 ప్రాంతంలో అక్కడొక భవనాన్ని నిర్మించారు. 1950 ప్రాంతంలో అప్పటి ప్రధాని పోసుపాటి కుమార్‌స్వామిరాజా దీనిని ప్రారంభించారు. 1969లో వచ్చిన పెనుతుపానుతో భవనం కూలిపోయింది. 1994లో దంటుసూర్యారావు ఈ గాంధీభవన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికై తిరిగి ఈ భవనాన్ని పునరుద్ధరించి సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గాంధీభవన్‌లో కొంత ప్రాంతాన్ని మహార్షిసాంబమూర్తి వికలాంగుల పాఠశాల నిర్వహణ కోసం నామమాత్రపు లీజుకు ఇచ్చి వాటితో నిర్వహణ చేస్తున్నారు. అలాగే యంగ్‌మెన్స్‌హ్యాపీ క్లబ్‌కు కూడా మరికొంత స్థలాన్ని కేటాయించారు. అప్పటి ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.15లక్షలు కేటాయించడంతో భవనం సుందరంగా రూపుదిద్దుకుంది.
స్ఫూర్తిని కలిగించే చిత్రపటాలు
ప్రముఖ గాంధేయవాది వాడ్రేవు సుందరరావు గాంధీస్మారక మందిరం కోసం అనేక చిత్రపటాలను సేకరించారు. గాంధీజీ బాల్యం నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు ఆయన పాల్గొన్న అనేక కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను సేకరించి గాంధీభవన్‌లో ఉంచారు. అక్కడే ఓ గాంధీ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారతప్రభుత్వం 1969లో గాంధీ శతజయంతి ఉత్సవాలు సందర్భంగా ముద్రించిన గాంధీజీ స్వీయరచనల పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. సుమారు 100 వరకు పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద కూడా గాంధీజీ స్వీయరచనలు అందుబాటులో లేవని చెబుతుంటారు. అలాగే ప్రతీరోజు ఉచిత కుటుశిక్షణను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు.