ఘాటు తగ్గిన పచ్చి మిర్చి
Published Sun, Sep 18 2016 8:04 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
► కిలో రూ.3 కూడా పలకని వైనం
► మార్కెట్‌లో వదిలి వెళ్లిపోతున్న రైతులు
వరంగల్‌సిటీ: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో ఆదివారం పచ్చి మిర్చి ధర దారుణంగా పడిపోయింది. కిలోకు రూ.3 చొప్పున కూడా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో రైతులు మార్కెట్‌లోనే పడేసి వెళ్లిపోయారు. ఒక్కో మిర్చి బస్తా మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు రవాణ ఖర్చు రూ. 25, మిరపకాయలు ఏరడానికి రోజుకు రూ.150 చొప్పున ఖర్చవుతోందని, తీరా మార్కెట్‌కు తీసుకొస్తే కనీస ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు కిలోకు రూ.3 కూడా చెల్లించని వ్యాపారులు రిటైల్ వర్తకులకు కిలో రూ.8 చొప్పున అమ్ముతున్నారని చెప్పారు. మిర్చి బస్తాలను ఇంటికి తీసుకెళ్తే మళ్లీ రవాణా ఖర్చులు అవుతాయని, అందుకే మార్కెట్‌లోనే పడేసి వెళ్తున్నామని తెలిపారు. అయితే, పచ్చి మిర్చికి డిమాండ్ లేకపోవడం వల్లే తాము కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
Advertisement