
శ్రీనివాసుడి చరణాల వద్ద ఆశీర్వాదం దొరికింది
పవిత్ర విజయదశమి రోజున, అందులోనూ నవరాత్రి పూర్ణాహుతి రోజున తనకు శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగిందని, ఆయన చరణాల సన్నిధిలో ఆశీర్వచనం దొరికిందని, ఇందుకు తాను ఎంతగానో ఆనందపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఒక గుర్తింపు ఉంటే.. ఆధ్యాత్మిక దేశంగా మరో గుర్తింపు ఉందని చెప్పారు. కొన్ని శతాబ్దాలుగా మన దేశం ప్రపంచానికి వసుధైక కుటుంబ సందేశాన్ని అందిస్తోందని ఆయన అన్నారు. విజయదశమి పర్వదినం రోజు, నవరాత్రి పూర్ణాహుతి రోజున శ్రీనివాసుడి చరణాల వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకోగలగడం తన భాగ్యమని ప్రధాని మోదీ తెలిపారు. ఆధ్యాత్మిక శక్తి, ఆశీర్వాదం.. ఈ రెండూ వ్యక్తి జీవితంలో సకారాత్మక ప్రభావాన్ని పెంచుతాయని ఆయన అన్నారు.
రాబోయే రోజుల్లో శ్రీనివాసుడి ఆశీస్సులతో మన దేశం శాంతి, సౌభ్రాతృత్వాలతో ముందుకు వెళ్లాలని, భవిష్యత్తులో దేశం పేదరికం నుంచి విముక్తి పొందాలని, సామాన్యుడి జీవితాన్ని మెరుగుపరచాలని ప్రార్థించినట్లు ఆయన దర్శనం, ఆశీర్వచనం తర్వాత చెప్పారు. ఆలయ ప్రధానార్చకుడు, ఇతర అర్చకులు ఆయనను ఆలయ ప్రాంగణంలో కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు చేయించి, ఆశీర్వచనం పలికారు. సంప్రదాయ దుస్తులలో శ్రీనివాసుడి దర్శనం చేసుకున్న ఆయనను.. ఆ తర్వాత ఓఎస్డీ డాలర్ శేషాద్రి వెన్నంటే ఉండి ఆలయ ప్రాంగణం నుంచి కారు వరకు సాగనంపారు. అంతకుముందు ప్రధానార్చకుడు, ఇతర అర్చకులు ప్రధాని మోదీకి స్వామివారి శేషవస్త్రాలు బహూకరించారు. సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు తదితరులు ఈ సందర్భంగా మోదీ వెంట ఉన్నారు.