రేపే ఫ్లైటు.. వెళ్లే దారేదీ?
హజ్ యాత్రికుల కష్టాలు
హైదరాబాద్‌కు బస్సులు, రైళ్లు కిటకిట
సకాలంలో చేరుకోకుంటే విమానం మిస్సే
సాక్షి,విజయవాడ:
విజయవాడ నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఏడాదికి 250 మంది వరకు హజ్‌కు వెళ్తూ ఉంటారు. ఈ నెల 27వ తేది మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హజ్ వెళ్లే విమానం బయలుదేరుతుంది. హజ్ వెళ్లే యాత్రికులంతా గురువారం సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పుష్కరాలకు వచ్చిన భక్తులతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. దీంతో హైదరాబాద్‌కు వెళ్లేందుకు యాత్రికులకు చోటు లభించడం లేదని తెలిసింది. కొందరు సొంత, అద్దె వాహనాల్లో హైదరాబాద్‌కు వెళ్లిపోగా, స్తోమత లేనివారు అవస్థలు పడుతున్నారు.
సహకారం.. సమాచారం కరువు
ఇదిలా ఉండగా.. తొలిసారి హజ్‌కు వెళ్లేవారుకి అక్కడ సమాచారం, వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పేవారే కరువయ్యారు. గత ఏడాది మైనార్టీ నాయకులు కొంతమంది చొరవ చూపించి ఒక ప్రముఖ ట్రావెల్స్ ద్వారా హజ్ యాత్రికులు హైదరాబాద్ వెళ్లే తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సహకారం అందిస్తారని టీడీపీలోని ముస్లిం పెద్దలంతా పెట్టుకున్న ఆశ అడియాసే అయ్యింది. యాత్రికుల ఇబ్బందుల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎవరికి వారు సొంతపనుల్లో నిమగ్నమయ్యారు. మరొకవైపు సమయం దగ్గరపడటంతో ఏం చేయాలో తెలియక హజ్‌యాత్రికలు గాభరా పడుతున్నారు. సకాలంలో హజ్ విమానం ఎక్కేందుకు ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.