‘నూతన’ ఉత్తేజం | happy new year | Sakshi
Sakshi News home page

‘నూతన’ ఉత్తేజం

Published Sun, Jan 1 2017 10:30 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

‘నూతన’ ఉత్తేజం - Sakshi

‘నూతన’ ఉత్తేజం

గతం గతః.. రాబోవు కాలం తేవాలి ‘కొత్త’ ఉత్తేజం.. అనుకోకుండా వచ్చిన అతిథి 2016 సంవత్సరం 365 రోజులు పూర్తి చేసుకుని బైబై చెప్పింది. ఎన్నో అనుభవాలు, అనుభూతులను మిగిల్చి.. జిల్లాల పునర్విభజనతో తరతరాలు మరిచిపోని ఏడాదిగా నిలిచింది. ఇప్పుడు మరో 365 రోజులు మనవెంటే ఉండేందుకు కొత్త సంవత్సరం 2017 వచ్చేసింది. శనివారం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సంబరం అంబరాన్నంటింది. టపాసులు పేల్చి.. డీజే హోరులో నృత్యం చేస్తూ.. కేక్‌లు కట్‌ చేసి కొత్త ఏడాదికి ప్రజలు స్వాగతం పలికారు. నవ వసంతం అందరిలోనూ సంతోషం నింపాలని ఆకాంక్షిస్తూ.. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు వేడుకలు కనుల విందుగా సాగాయి.

ఆదిలాబాద్‌/ఆదిలాబాద్‌ కల్చరల్‌ : జిల్లాలోని పట్టణలు, మండల కేంద్రాల్లో స్వీటుహౌస్‌ల్లో కేక్‌లు ప్రత్యేకంగా విక్రయించారు. కేక్‌లు, పలు తినుబండరాలు, చికెన్, మటన్‌ వంటకాల దుకాణాలు పదుల సంఖ్యలో వెలిశాయి. ప్రత్యేకంగా గ్రీటింగ్‌లు తెలిపేందుకు యువత విభిన్న రీతులతో ఉత్సాహంగా గడిపారు. వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌లలో వందల సంఖ్యలో మేసేజ్‌లు, న్యూఇయర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మందుబాబులు, స్నేహితులు బృందాలుగా మందువిందు భోజనాలు ఆరగించారు. ఎక్కడ చూసినా న్యూఇయర్‌ శుభాకాంక్షల బోర్డులు, ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.

సిరులు పండించాలి..
కొత్త ఏడాదిలో రైతాంగం కష్టాలు తీరాలి. అందుకు ప్రభుత్వం వారిని పంటల సాగుకు ప్రోత్సహించాలి. జిల్లా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. పత్తి, సోయాబీన్‌ పంటలు ప్రధానంగా పండిస్తారు. జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుండగా, ఈ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తే పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. వీటితోపాటు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చనాఖా–కొరటా బ్యారేజీ పూర్తయితే తాంసి, జైనథ్, బేల మండలాల్లోని రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఉట్నూర్, గుడిహత్నూర్‌ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా టమాటా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో జ్యూస్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలోని పత్తి మార్కెట్‌లను అభివృద్ధి చేసి..దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా అభివృద్ధి చెందుతారు. జిల్లాలో మిషన్‌కాకతీయ ద్వారా చేపట్టిన చెరువులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలి.

పరిశ్రమలకు ఊతం ఇవ్వాలి..
జిల్లాలో మూతపడ్డ జిన్నింగ్‌మిల్, ఆయిల్‌మిల్‌తోపాటు సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) పునరుద్ధరించడం జిల్లా అభివృద్ధికి కీలకం. వీటి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం సీసీఐ పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. జిల్లా ప్రజలు సీసీఐపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 30 జన్నింగ్‌మిల్లుల, 90 ఆయిల్‌మిల్లులు మూతపడ్డాయి. వీటిని తెరిపించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. దీంతోపాటు జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితే ఇక రాష్ట్రంలోనే జిల్లాకు మంచి గుర్తింపు లభిస్తుంది.

విద్య, వైద్యం మెరుగవ్వాలి..
జిల్లాలో విద్య, వైద్యం మెరుగవ్వాలి. వైద్య పరంగా జిల్లాకు రిమ్స్‌ వైద్య కళాశాల పెద్ద దిక్కు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని త్వరగా పూర్తి చేయాలి. దీని ద్వారా ప్రజలు హైదరాబాద్, నాగ్‌పూర్‌లకు వెళ్లే తిప్పలు తప్పుతాయి. జిల్లాలో గిరిజన ప్రాంత ప్రజల కోసం ఉట్నూర్‌ కేంద్రంగా జిల్లా ఆసుపత్రి నిర్మిస్తే ఆదివాసీలకు వైద్య సేవలు అందుతాయి. జిల్లా విద్యారంగానికి వస్తే ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదు. అప్పట్లో ముఖ్యమంత్రి జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఈ ఏడాది నవోదయ పాఠశాలతోపాటు మరికొన్ని గురుకులాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు, కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైన ఉంది.

లక్ష్యంతో ముందకు కెళ్లాలి..
కొత్త సంవత్సరంలో యువత, విద్యార్థులు ఓ లక్ష్యంతో ముందుకెళ్లాలి. విద్యార్థులు భవిష్యత్తులో ఏం సాధించుకోవాలనుకుంటున్నారో అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించుకోవాలి. నిరుద్యోగులు నిర్ధేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా శ్రమించాలి. కష్టపడనిది ఏదీ రాదని గ్రహించాలి. ఇప్పటి నుంచే అవసరమైన పుస్తకాలు చదవడం, చదివిన వాటిని మననం చేసుకోవడం ప్రారంభించాలి. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకూడదు. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని మరిచిపోకూడదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement