- టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు నిర్వీర్యం
- చేనేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు
- మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ధ్వజం
ధర్మవరంటౌన్ :
రాష్ట్రంలో జరుగుతున్న చేనేతల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని నివాసంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ముడిపట్టు ధరలు మూడింతలు పెరిగిపోయి చేనేతలు అల్లాడి పోతుంటే ఏడాదిన్నర పాటు రాయితీ బిల్లులు పెండింగ్ పెట్టి దొంగనాటకం ఆడుతోందని దుయ్యబట్టారు. పట్టుచీరలకు మద్దతు ధర లేక, విపరీతంగా పెరిగిన ముడి సరుకు ధరల కారణంగా నష్టాలపాలై నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఇటీవల చంద్ర అనే చేనేత కార్మికుడు అప్పుల బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ రెండున్నరేళ్లలో ఒక్క కార్మికుడికైనా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుద్వారా గానీ, వ్యక్తిగత రుణాలను గానీ అందించారా అని ప్రశ్నించారు. చేనేతల ఆత్మగౌరవం దెబ్బతీసే పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నెలకొందన్నారు. గతంలో చేనేతలకు లాంబార్డ్ ఇన్సూరెన్స్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.15 వేల వరకు నగదు రహిత ప్రైవేట్ వైద్యం అందించే వీలు ఉండేదని గుర్తు చేశారు. ఆ పథకాన్ని ప్రస్తుత పాలకులు అటకెక్కించారన్నారు. ప్రభుత్వానికి చేనేతల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న చేనేతల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ పరిహారం అందించాలన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదుకు ప్రజాదరణ లేకపోవడంతో రేషన్ డీలర్లు, జన్మభూమి కమిటీ సభ్యులకు టార్గెట్‌లు ఇచ్చి.. ప్రజల నుంచి బలవంతంగా రూ.100 చొప్పున కట్టించుకుని సభ్యత్వం ఇస్తున్నారన్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకోకపోతే రేషన్‌కార్డులు, పింఛన్ రద్దు చేస్తామని టీడీపీ నాయకులు బెదిరించడం సరికాదన్నారు.