పాలసముద్రం సమీపంలో ఈ నెల 14న కర్నూలు జిల్లా వెలుగోడుకు చెందిన సిమెంట్ లారీ డ్రైవర్ ఓబుళేసు (50) దారుణ హత్య కేసును గోరంట్ల పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
సోమందేపల్లి (గోరంట్ల) :
పాలసముద్రం సమీపంలో ఈ నెల 14న కర్నూలు జిల్లా వెలుగోడుకు చెందిన సిమెంట్ లారీ డ్రైవర్ ఓబుళేసు (50) దారుణ హత్య కేసును గోరంట్ల పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితులైన వడ్డె పురుషోత్తం (25), అతని సోదరుడు వడ్డె మనోహర్ (28), సి.రామాంజినేయులు (30), నవాబ్‌కోటకు చెందిన వెంకట్రాముడు (28)ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో పుట్టపర్తి రూరల్ సీఐ శ్రీధర్, గోరంట్ల ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. గోరంట్లకు చెందిన వడ్డే మనోహర్ ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ అవసరమైంది. దీంతో అతని వద్ద డబ్బులు కూడా లేకపోవడంతో తన సోదరుడైన వడ్డే పురుషోత్తంకు విషయం తెలిపాడు. గతంలో పురుషోత్తం సిమెంట్ లారీ డ్రైవర్‌గా కర్ణాటకలోని పెద్ద బళ్లాపురంలో పనిచేస్తూ ఉండేవాడు. సిమెంట్ లారీలను అపహరించి, సిమెంట్ బస్తాలు ఎత్తుకెళ్లొచ్చని మాట్లాడుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 13న పులివెందుల పట్టణ సమీపంలోని గంగమ్మ గుడి వద్దకు ఇద్దరు అన్నదమ్ములతో పాటు గోరంట్లకు చెందిన వారి స్నేహితుడైన రామాంజనేయులను కూడా వెంట తీసుకెళ్లారు.
ముందుగా అనుకున్నట్లుగానే రామాంజినేయులతోపాటు నవాబ్ కోటకు చెందిన వెంకట్రాముడును కూడా కలుపుకుని వాటా ఇస్తామని నమ్మబలికారు. గంగమ్మ గుడి వద్ద ఆగి ఉండగా పులివెందుల వైపు నుంచి సిమెంట్ లారీ వచ్చి సమీపంలోని హోటల్ వద్ద ఆగింది. డ్రైవర్ భోజనం చేస్తుండగా వడ్డే మనోహర్ డ్రైవర్‌ను పరిచయం చేసుకున్నాడు. తాము గోరంట్లకు వెళ్లాలని, వెళ్లేందుకు బస్సులు లేవు.. లారీలో గోరంట్లకు వస్తామని చెప్పారు. దీంతో లారీ డ్రైవర్ ఓబుళేసు వారి మాటలు నమ్మి లారీలో తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. పథకం ప్రకారం ముందుగా అనుకున్నట్లు తలుపుల మండలం బట్రేపల్లి వద్ద లారీ డ్రైవర్‌ను హతమార్చి సిమెంట్ బస్తాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కోరేవాండ్లపల్లి వద్ద మనోహర్ డ్రైవర్ ఓబుళేసుపై దాడి చేశారు. వెంటనే పక్కనే ఉన్న పురుషోత్తం లారీ డ్రైవర్ ఓబుళేసును పక్కకు లాగి, డ్రైవింగ్ సీటులో కుర్చోని లారీని నడుపుతుండగా మనోహర్, రామాంజినేయులు విచక్షణ రహితంగా ఓబులేషును చితకబాదారు. ఈ సమయంలో తనను వదిలేసి సిమెంట్ బస్తాలు తీసుకెళ్లాలని మృతుడు ఓబుళేసు వారిని వేడుకున్నాడు. అవసరమైతే తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడని భావించి, అతన్ని హతమార్చారు. అనంతరం లారీలో ఉన్న 660 సిమెంట్ బస్తాలను కొండతిమ్మంపల్లి గ్రామానికి చెందిన పలువురికి కొన్ని విక్రయించారు. మరికొన్ని ముందస్తుగా ఒప్పందం చేసుకున్న నవాబ్‌కోటకు చెందిన వెంకట్రాముడు తోటలో నిల్వ ఉంచారు. అయితే ఈనెల 14న లారీని పాలసముద్రం సమీపంలో మృతదేహంతో పాటు వదిలివెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా లారీ వద్ద మూడు జతల చెప్పులు కనిపించాయి. వాటి ఆధారంగా విచారణ జరపగా నిందితులు పట్టుబడ్డారు. నిందితులను పుట్టపర్తి మండలం పాతార్లపల్లి వద్ద అరెస్టు చేశారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నామని సీఐ శ్రీధర్ తెలిపారు. రూ.2.70 లక్షలు విలువగల 660 బస్తాలతోపాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.