సాంకేతిక కారణాలు సరిచేయించాల్సింది..
స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన సీపీఎం నేత బి.వి.రాఘవులు
అల్లిపురం (విశాఖపట్నం) : పార్టీ ఫిరాయింపులపై చర్యల పిటిషన్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరిస్తున్నాం అనే బదులు వాటిని సరిచేసి ఇవ్వాలని పిటిషన్‌దారులకు స్పీకర్ సూచించి ఉండాల్సిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. టీడీపీలోకి వెళ్లిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ వేసిన పిటిషన్ చెల్లదనడం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు తగదన్నారు.
కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ పరిశీలనలో భాగంగా విశాఖపట్నం వచ్చిన ఆయన ఆదివారం ఇక్కడి సీపీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పిటిషన్‌లో లోపాలుంటే చెప్పి సరిచేయించాలని, ఇది కేవలం అధికార పార్టీకి మేలు చేయడమేనని స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. స్పీకర్ వ్యవహార శైలి చట్టానికి విరుద్ధంగా ఉందని భావిస్తే వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చన్నారు.