
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో మతోన్మాదం పెరిగింద ని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ప్రారంభమయ్యాయి, ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, రాజ్యమే మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని, ప్రతీ అంశాన్ని మతానికి జోడించి, ప్రజల మధ్య విభజన తెస్తోందని మండిపడ్డారు. విద్యా, న్యాయ వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ చూస్తోందని, దీనికి కేంద్రం సహకరిస్తోందని ఆరోపించారు. మనువాద సిద్ధాంతాన్ని అమలుచేస్తూ, మతాల మధ్య చిచ్చుపెడుతున్నదని విమర్శించారు.
దేశంలో సామాజిక తరగతులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రవాదం, నల్లధనం పెట్రేగిపోయాయని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. పేదలు, అట్టడుగు, సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే 28 రాజకీయ, సామాజిక, ఉద్యమ శక్తులతో కలసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ శిక్షణా తరగతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నర్సింహారావు ప్రిన్సిపల్‌గా వ్యవహరించగా పార్టీ ముఖ్యులు టి.జ్యోతి, జాన్‌వెస్లీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment