స్నేహమని నమ్మితే ....
చేయని నేరానికి..
జీవచ్ఛవంగా మారిన బాధితురాలు
స్నేహమని నమ్మితే కాలయముడయ్యాడంటున్న తల్లిదండ్రులు
కఠినంగా శిక్షించాలంటున్న మహిళా, ప్రజాసంఘాలు
తిరుపతిక్రైం: తిరుపతిలో ప్రేమించలేదనే కారణంతో యువతిని బైక్‌తో ఢీకొని హత్యాయత్నానికి పాల్పడ్డ కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. స్నేహంగా ఉంటూనే హత్యాయత్నం చేయడంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ నిందితులు బాధితురాలిని బెదిరించినట్లు తెలుస్తోంది.
పగతోనే ఘాతుకానికి ఒడిగట్టారు..
పగతోనే నిందితులు నవీన్‌కుమార్, యశ్వంత్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని కనకభూషణం లేఔట్‌కు చెందిన బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పైగా నిందితులు అరెస్టు చేయడంలో మొదట్లో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని వాపోతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ కుమార్తెను బెదిరిం చేందుకు కూడా నిందితులు వెనుకాడలేదని ఆరోపించారు. మృగాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
రెండో నిందితుడికి రిమాండ్
ప్రేమపేరుతో వేధించి ఓ యువతిని వాహనంతో ఢీ కొని గాయపరిచిన కేసులో రెండో నిందితుడు జి.యశ్వంత్‌ను పోలీసుల మంగళ వారం తిరుపతి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇతడికి జూలై 13వతేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జూనియర్ జడ్జి సన్యాసినాయుడు ఆదేశాలు జారీ చేశారు. నిందితుడు యశ్వంత్‌పై అలిపిరి పోలీసులు ఐపీసీ 354, 354డి, 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో మొదటి నిందితుడుగా వున్న ఎన్.నవీన్‌కుమార్ ఈనెల 21వతేదిన కోర్టులో సరెండర్ అయి మరుసటి రోజు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.
రౌడీషీటు నమోదు
యువతలను వాహనంతో ఢీ కొన్న నవీన్‌కుమార్, యశ్వంత్‌పై నిర్భయ చట్టం నమోదు చేశామని, అంతేగాక వీరిపై రౌడీషీటు తెరిచామని అలిపిరి సీఐ శ్రీనివాసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేయడంలో పోలీసులు ఎటువంటి నిర్లక్ష్యం వహిం చలేదన్నారు. కాగా తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి కూడా దీనిపై స్పందించి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఓ ప్రకటన విడుదల చేశారు.
స్నేహమంటూ మాట కలిపితే.. ఆప్తుడనుకుంది. సలహాలిస్తుంటే.. స్నేహితుడిగా భావించింది. అయితే మంచిత నం ముసుగులో ముంచేస్తాడని, కా దంటే ప్రాణాలే తీసేందుకు తెగిస్తాడని ఊహించలేకపోయింది. ప్రస్తుతం వెన్నెముక దెబ్బతో జీవచ్ఛవంగా మారి దీనస్థితిలో మంచానికి పరిమితమైంది.
సకాలంలో స్పందించడంలేదు
మహిళల పట్ల జరుగుతున్న వేధింపులు, హత్యాయత్నాల సంఘటనలపై పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇలాంటివి అరికట్టవచ్చు. ఇప్పటికైనా బాధితురాలికి సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత వారిపై వుంది. నిర్భయచట్టం కింద వచ్చే డబ్బులు వెంటనే ప్రభుత్వం మంజూరు చేసి అన్ని విధా లా ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. - నిర్మల, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి