వీడని భయం
రేఖపల్లి పంచాయతీలోని అన్నవరం గ్రామంలో కాళ్ల వాపు వ్యాధితో ముగ్గురు మరణించడం, అవే లక్షణాలతో బాధపడుతున్న మరికొందరిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించిన నేపథ్యంలో గ్రామస్తులు భయకంపితులవుతున్నారు.
-
అన్నవరం గ్రామంలో తగ్గని కాళ్లవాపు
-
కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
-
ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో భయాందోళనలు
-
గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరం
ముందెన్నడూ లేనివిధంగా కాళ్ల వాపు వ్యాధి ప్రాణాంతకంగా మారడంతో గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మహమ్మారిపై వైద్యాధికారుల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో.. దీనిపై వారికే పూర్తి అవగాహన లేనట్టు తేటతెల్లమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బాధితులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి, వైద్యులు చేతులు దులుపుకొంటున్నారని గిరిజనులు మండిపడుతున్నారు.
– అన్నవరం (వీఆర్ పురం)
రేఖపల్లి పంచాయతీలోని అన్నవరం గ్రామంలో కాళ్ల వాపు వ్యాధితో ముగ్గురు మరణించడం, అవే లక్షణాలతో బాధపడుతున్న మరికొందరిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించిన నేపథ్యంలో గ్రామస్తులు భయకంపితులవుతున్నారు. శుక్రవారం ప్రత్యేక వైద్య బృందం గ్రామంలో పర్యటించింది. గ్రామస్తులు తినే ఆహారంతో పాటు వారి వద్ద నుంచి రక్తనమూనాలను అనేక ఇళ్లలో సేకరించి, కాకినాడకు తీసుకువెళ్లారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, కారణం ఏమిటనే దానిపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో గ్రామస్తులు భీతిల్లుతున్నారు. రేఖపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరం శనివారం కూడా కొనసాగింది.
బంధువుల ఆందోళన
అన్నవరం గ్రామానికి చెందిన 19 మందితో పాటు పెదమట్టపల్లికి చెందిన ఇద్దరు, లక్ష్మీనగరానికి చెందిన మరో ఇద్దరు మొత్తం 23 మంది కాళ్లవాపు లక్షణాలతో బాధపడుతున్న వారిని మెరుగైన చికిత్స కోసం రెండు రోజుల క్రితం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నప్పటికీ, వారి ఆరోగ్యం మెరుగు పడకపోగా, అందులో కొందరికి ముఖంలో కూడా వాపు లక్షణాలు బయటపడ్డాయని తెలియడంతో.. గ్రామంలోని వారి బంధువులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నవరం గ్రామానికి చెందిన సోడె గోపాలకృష్ణకు ముందు కాళ్లు వాపునకు గురయ్యాయి. ఇతడిని గురువారం అంబులెన్స్‌లో కాకినాడకు తరలించారు. ఇప్పుడు అతడి ముఖ భాగం కూడా వాపుతో ఉన్నట్టు ఫోన్ ద్వారా సమాచారం తెలియడంతో అతడి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందరినీ కాపాడాలి
కాకినాడ ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించిన కాళ్లవాపు బాధితులను కాపాడాలి. ప్రభుత్వం వారందరి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. కాళ్లవాపుతో పాటు ముఖం వాపుతో బాధపడుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వం స్పందించి బాధితుల ప్రాణాలను కాపాడాలి.
– మడకం జోగమ్మ, రేఖపల్లి సర్పంచ్