అమ్మకు అభయం! | health tips for pregnents | Sakshi
Sakshi News home page

అమ్మకు అభయం!

Published Wed, Jul 27 2016 2:58 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

అమ్మకు అభయం!

అమ్మకు అభయం!

పురుడుపోసుకున్న ‘పీఎంఎస్‌ఎంఏ’
మాతాశిశు సంరక్షణ  బాధ్యత ఇక సర్కారుదే
పేరు నమోదు చేసుకుంటే చాలు..
గర్భందాల్చిన నుంచి ప్రసూతి దాకా పరీక్షలన్నీ ఉచితం

కామారెడ్డి : సురక్షిత ప్రసవాల కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్‌ఎంఏను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతి నెల తొమ్మిదో తేదీన సురక్షిత మాతృ  దినోత్సవంగా పరిగణిస్తారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు ఉచిత వైద్య సేవలందిస్తారు. ఈ పథకంలో భాగంగా మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు అన్ని రకాల సేవలను ఉచితంగానే అందిస్తారు. ఇందుకోసం ఆసుపత్రి రికార్డుల్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

పేరు నమోదు చేసుకున్న వెంటనే వారి పేరున ఓ కార్డును అందిస్తారు. ఈ పథకంలో గర్భిణులకు అన్ని సేవలూ అందుతాయి. రక్త పరీక్షల్లో హిమోగ్లోబిన్ పరీక్ష, రేండమ్ బ్లడ్‌షుగర్, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, రక్త వీడీఆర్‌ఎల్, బ్లడ్ గ్రూప్ ఆర్‌హెచ్ టైపింగ్, మూత్రపరీక్ష, థైరాయిడ్, గ్లూకోజ్ చాలెంజ్ తదితర పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. ఇవన్నీ ఉచితమే..

వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా.. సకాలంలో  వైద్య సేవలు అందక నేటికీ మాతాశిశు మరణాలు  సంభవిస్తూనే ఉన్నాయి. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొచ్చింది. గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందించడానికి, సురక్షిత         ప్రసవాలు జరిగేలా చూసేందుకు ప్రధానమంత్రి   సురక్షిత్ మాతృత్వ అభియాన్(పీఎంఎస్‌ఎంఏ)ను అమలు చేస్తోంది. - కామారెడ్డి

ప్రతి నెల 9వ తేదీన..
పీఎంఎస్‌ఎంఏ కింద ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని వారిని, డ్రాపవుట్ గర్భిణులను గ్రామాలలోని ఆశకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గుర్తించి ప్రతినెలా పీహెచ్‌సీలకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా గర్భిణులకు పీహెచ్‌సీలలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి వారంలో రెండుసార్లు వైద్య పరీక్షలు చేస్తారు. ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే తీవ్రతను బట్టి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తారు.

జననీ సంరక్షణ..
నిరుపేద కుటుంబాల్లో గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందే అవకాశం తక్కువ. వైద్య పరీక్షలూ చేయించుకునే స్థోమత లేని కుటుంబాలెన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాలకు జననీ సంరక్షణ పథకం అండగా ఉంటోంది. ఈ పథకంలో గర్భిణులకు అవసరమైన పరీక్షలను ఉచితంగానే చేస్తారు. సాధారణ ప్రసవం అయిన వారికి మూడు రోజుల పాటు, శస్త్ర చికిత్స (సిజేరియన్) ద్వారా బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు ఏడు రోజుల వరకు ఉచితంగా పౌష్టికాహారం అందజేస్తారు.

సురక్షిత ప్రసవాల కోసం...
ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ గర్భిణులకు వరంలాంటిది. ఈ పథకం పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇందులో నిర్దేశించిన ప్రకారంగా గర్భిణులు వైద్యులు ఇచ్చే సూచనలు పాటిస్తే ప్రసవాలకు ఏ ఇబ్బందీ ఉండదు. గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే నెలనెలా ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. వీటిని పాటిస్తే గర్భిణికి, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు మంచిది. మాతాశిశు మరణాలనూ నివారించవచ్చు.

వ్యాయమం
గర్భిణులు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో 10 నిమిషాల చొప్పున వాకింగ్ చేయాలి. అయితే అలసట కలగకుండా చూసుకోవాలి. అలాగే కూర్చొని చిన్నచిన్న వ్యాయామాలు చేయవచ్చు.

ఆహారం
గర్భిణులు మాంసకత్తులు, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఉడకబెట్టిన రెండు గుడ్లు తినాలి. అయితే పచ్చసొనను తినకూడదు. ఖర్జూరం, కందిపప్పు, ఆకు కూరలు, బీట్‌రూట్, క్యారెట్, బీరకాయ, చిక్కుళ్లు, సోయాబీన్, మొలకెత్తిన గింజలు తినాలి. పాలు తాగాలి.

గర్భిణులు చేయకూడనివి
దుంపకూరలు తినకూడదు. అధిక నూనె వాడరాదు. కారం, మసాలా పదార్థాలు, తీసుకోకూడదు. మిఠాయిలు తగ్గించాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా మితంగా ఎక్కువసార్లు తినాలి.

స్థూలకాయులు అధికాహారం తీసుకోరాదు.

అధిక బరువులుఎత్తకూడదు.

దూరప్రయాణాలు చేయరాదు. కుదుపులతో కూడిన మార్గాల్లో ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం.

ఒత్తిడికి దూరంగా ఉండాలి.

గర్భిణులు ఏ నెలలో ఏం చేయాలి..
నెలసరి దాటిన ఒక వారానికి వైద్యుడిని సంప్రదించాలి. గర్భం దాల్చినట్లు నిర్ధారణైతే.. వెంటనే ఫోలిక్‌యాసిడ్ మాత్రలు వాడాలి. వీటిని మూడు నెలల వరకు విధిగా వాడాలి. దీని వల్ల గర్భంలో ఉన్న బిడ్డ నాడీవ్యవస్థలో అపసవ్యాలు తగ్గుతాయి.

గర్భం దాల్చిన వారిలో కొందరికి ఐదోవారం నుంచి 12వ వారం వరకు వాంతులవుతాయి. వీటిని తగ్గించుకోవడానికి ఆహారంలో నూనె, మసాలాలు, కారం, పులుపు తగ్గించాలి.

మొదటి మూడు నెలల్లో ఆరోగ్య తనిఖీతో పాటు స్కానింగ్, రక్త పరీక్షలు చేయించుకోవాలి.

 నాలుగో నెల నుంచి ప్రసవ సమయం వరకు వైద్యుల సూచనల మేరకు ఐరన్, కాల్షియం మాత్రలు వాడాలి. వీటి వల్ల రక్తహీనత తగ్గడంతో పాటు ఎముకలు బలపడతాయి. డీవార్మింగ్(నులి పురుగులు) నివారణకు అల్బెండజోల్ మాత్రను వేసుకోవాలి. నులి పురుగులను నివారిస్తే.. తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది. ఇదే నెలలో ఒక మోతాదు ధనుర్వాతం ఇంజక్షన్ చేయించుకోవాలి.

ఐదో నెలలో స్కానింగ్ చేయించుకోవాలి. ఈ స్కానింగ్ ద్వారా బిడ్డ తల ఎలా ఉంది, వెన్నుపై కణతులేమైనా ఉన్నాయా, గుండె, మూత్రపిండాలు, ఇతర అవయవాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. ముఖ్యంగా మధుమేహం, జన్యులోపాలు, వైకల్యంతో బాధపడుతున్నవారు. 30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చినవారు, గతంలో అబార్షన్ అయినవారు, మేనరికం వివాహం చేసుకున్నవారు తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి. ఈ నెలలో రెండో మోతాదు ధనుర్వాతం ఇంజక్షన్ చేయించుకోవాలి.

ఆరో నెలలో నెలసరి తనిఖీలు చేయించుకోవాలి.

ఏడో నెల దాటిన తర్వాత ప్రసవించే వరకు ప్రతి 15 రోజులకోసారి ఆరోగ్య తనిఖీలు చేయించుకోవాలి. బరువు, రక్తపోటు, మూత్రపరీక్షలు, రక్తపరీక్షలు తప్పనిసరి..

రక్తపోటు, మధుమేహం, ఇతర సమస్యలు ఉన్నవారు ప్రసవ సమయానికన్నా ముందే ఆసుపత్రిలో చేరడం ఉత్తమం.

గర్భిణులకు ఉమ్మనీరు పోవడం, తలనొప్పి, జ్వరం, కడుపునొప్పి రావడం, బ్లీడింగ్ అవడం, కడుపులో శిశు కదలికలు లేకపోవడం, ముఖం, కాళ్లు వాపులు రావడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement