సిటీకి ఫీవర్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో డెంగీ, మలేరియా, కలరా, స్వైన్‌ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు మురుగు కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్ల మధ్య నీరు నిల్వ ఉండటంతో దోమలు, ఈగలు వ్యాపించి బస్తీ వాసుల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రులతో పాటు బస్తీల్లోని క్లినిక్స్ సైతం రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 98 డెంగీ, 80 పైగా మలేరియా, 40 కలరా, నాలుగు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే రెండో వారం నుంచే వర్షాలు ప్రారంభం కావడంతో మూసీ పరీవాహక ప్రదేశాలే కాకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బేగంపేట్ వంటి ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ జ్వరంతో చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లే రోగులను కూడా మలేరియా, డెంగీ జ్వరాలను బూచిగా చూపుతున్నారు. రకరకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్లేట్‌లెట్స్ కౌంట్స్ పడిపోయాయని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని వారి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా వసూలు చేస్తుండటం విశేషం.
రికార్డులకెక్కని కార్పొరేట్ వైద్యం
ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నమోదైనవి తప్పితే కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లోని డెంగీ, మలేరియా కేసుల వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చేరడం లేదు. ప్రభుత్వం ఐజీఎం ఎలీసా టెస్టులో పాజిటివ్ వచ్చిన కేసులను మాత్రమే డెంగీగా పరిగణిస్తుంది. కానీ కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్ ఎన్‌ఎస్–1 టెస్టు చేస్తున్నాయి. వీటిలో పాజిటివ్ వచ్చిన వాటిని డెంగీ జ్వరంగా నిర్ధారిస్తున్నారు.
నిజానికి రోగి నుంచి రెండో శాంపిల్ సేకరించి నిర్ధారణకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పంపాలి. ప్రభుత్వ ఆస్పత్రులు మినహా నగరంలో ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా ఐపీఎంకు రెండో శాంపిల్‌ను పంపడం లేదు. సీజన ల్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని ఎపిడమిక్ సెల్‌కు తెలియజేయాలి. కానీ ఏ ఒక్కరూ ఇవ్వడం లేదు. ఇదే అంశంపై ఆస్పత్రికి నోటీసులు జారీ చేసినా, వైద్యాధికారులు తనిఖీలు చేసినా వెంటనే ప్రభుత్వంలోని పెద్దల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని జిల్లా వైద్య ఆ రోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
గ్రేటర్‌లో నమోదైన సీజనల్ వ్యాధులు ఇలా..
వ్యాధి 2011 2012 2013 2014 2015 2016
మలేరియా 352 528 189 125 84 80
డెంగీ 177 452 52 19 140 98
స్వైన్‌ఫ్లూ 11 320 67 31 1082 4