ముచ్చుమర్రిలో నీటి మునిగిన వరి నాట్లు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గురువారం రాత్రి కూడా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
– లోతట్టు ప్రాంతాలు జలమయం
– ఉల్లి పంటకు అపార నష్టం
– నీట మునిగిన పంటపొలాలు
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గురువారం రాత్రి కూడా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉల్లి తడచిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కర్నూలు, కల్లూరుల్లో 45.2 మిమీ వర్షపాతం నమోదవడంతో సంతోష్‌నగర్ ప్రాంతంలోని వివిధ కాలనీల నుంచి నీరు సమతానగర్ గనిగంతలను ముంచెత్తింది. దీంతో 30 గుడిసెలు నీటి మునిగి బియ్యం, పప్పు ఇతర వస్తువులు తడిసిపోయి.. దాదాపు రూ.10 లక్షల ఆస్తినష్టం సంభవించింది. కాలనీ వాసులు రాత్రంతా జాగరణ చేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. జిల్లా మొత్తం మీద సగటున 10.1 మి.మీ వర్షపాతం నమోదు అయింది. అత్యధికంగా పగిడ్యాలతో 57మి.మీ వర్షపాతం నమోదు అయింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 125.7మిమీ ఉండగా ఇప్పటి వరకు 90.4 మి.మీ. నమోదైంది.. ఇంకా 28 శాతం లోటు ఉంది. పగిడ్యాలలో 57మి.మీ, సి.బెళగల్‌లో 42.4, మంత్రాలయంలో 39.2, కోసిÜగిలో 36.8, నందవరంలో 32.2, మహనందిలో 24.8, మిడుతూరులో 23.2, గూడూరులో 22.6, కౌతాళంలో 16,2, కొత్తపల్లిలో 12 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి.