‘అనంత’లో భారీ వర్షం
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఖరీఫ్ సీజన్‌లో తొలిసారిగా అనంతపురం జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. 63 మండలాల్లో వర్షం కురవగా ఒకే రోజు 25.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. రాయదుర్గం, రొద్దం, పుట్లూరు తదితర ఐదారు మండలాల్లో కర్బూజా, కళింగర, ఆముదం, మిరప, టమాట లాంటి పంటలు స్వల్పంగా దెబ్బతినడంతో రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారీ వర్షం కురిసిన మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లడంతో అక్కడక్కడ చెరువుల్లో రెండు మూడు నెలలకు సరిపడా వర్షపు నీరు చేరడంతో రైతుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.
ఖరీఫ్‌లో వేసిన వేరుశనగ, కంది, ఆముదం, ప్రత్తి పంటలతో పాటు ఇటీవల వేసిన ప్రత్యామ్నాయ పంటలకు ఈ వర్షాలు ఊరటనిస్తాయని అధికారులు చెబుతున్నారు. పశుగ్రాసం సమస్య, పట్టు, పండ్లతోటలకు కొంత ఉశమనం కలిగించాయి. మొత్తం మీద సోమందేపల్లి మండలంలో అత్యధికంగా 71.6 మి.మీ వర్షం కురిసింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ప్రస్తుతానికి 40 మి.మీ నమోదైంది.