గుంటూరు : గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని 15 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా సముద్ర తీరప్రాంతమైన రేపల్లె, వేమూరు, పొన్నూరు, బాపట్ల నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా ప్రస్తుతానికి పంటలకు ఇబ్బంది లేనప్పటికీ మరో రెండు రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే కూరగాయల పంటలు, రొయ్యల చెరువులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. జిల్లాలో అత్యధికంగా కర్లపాలెం మండలంలో 146.4 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలో 1.0 మి.మీ. నమోదైంది.
వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయంగా మారి జనజీవనం స్తంభించింది. కాకుమాను మండలం బీకేపాలెంలో పెంకుటిల్లు కూలింది. ప్రాణ నష్టం జరగలేదు. నిజాంపట్నం వద్ద సమద్రంలోకి ఈనెల 16వ తేదీన ఐదు ఫైబర్ బోట్‌లలో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. వీటిలో రెండు తిరిగి రాగా, మూడు బోట్‌లు సముద్రంలోనే ఉండిపోయాయి. గురువారానికి కూడా ఇవి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. మూడు బోట్‌లలో 18 మంది జాలర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరి ఆచూకీ కోసం చెన్నై నుంచి ప్రత్యేక షిప్ ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు
Published Thu, May 19 2016 8:23 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement