శ్రీగిరికి పోటెత్తిన భక్తజనం
- రెండురోజులుగా ఇదే పరిస్థితి
- ఆలయ పూజావేళల్లో మార్పులు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల దర్శనానికి సోమవారం కూడా భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో గత శుక్రవారం నుంచి ప్రారంభమైన రద్ధీ శని, ఆది, సోమవారాలు కొనసాగింది. సోమవారం సుమారు 80వేలకు పైగా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. మన రాష్ట్రం నుంచేగాకుండా తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు వేకువజామున 5.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఉచిత, ప్రత్యేక దర్శన భక్తులకు దూర దర్శనం ఏర్పాటు చేశారు. సామూహిక, ప్రత్యేక అభిషేకం సేవాదారులను గర్భాలయంలోకి అనుమతించారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు భక్తులరద్ధీ సాధారణ స్థాయిలో ఉంటుదనే అంచనాతో ఉన్నారు. శివదీక్షా విరమణ కార్యక్రమం ఆదివారంతో ముగిసినప్పటికీ సోమవారం కూడా శివదీక్షా ఇరుముడులను సమర్పించేందుకు వందల సంఖ్యలో స్వాములు చేరుకున్నారు. దీంతో వారికి ప్రత్యేకంగా స్వామివార్ల స్పర్శదర్శనాన్ని కల్పించారు.
పూజా వేళల్లో మార్పులు..
భక్తుల రద్దీని దృష్టిలోఉంచుకుని ఆలయ పూజావేళల్లో మార్పులు చేశారు. మంగళవారం వేకువజామున 4.30గంటలకు మంగళవాయిద్యాలు, 5గంటలకు సుప్రభాతం, 6గంటలకు మహామంగళహారతి, 6.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యలా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 6 నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు తిరిగి ప్రారంభమవుతాయి.