srigiri
-
శ్రీగిరికి ఉత్సవ శోభ
- రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది వేడుకలు ప్రారంభం - భారీగా తరలి వచ్చిన కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు - ఆలయ పూజా వేళల్లో మార్పు శ్రీశైలం: ఉగాది మహోత్సవాలకు జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ముస్తాబైంది. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు స్వస్తిశ్రీ హేవళంబి నామ సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. స్వామివార్ల ఆలయప్రాంగణంతోపాటు ప్రధాన వీధులు విద్యుత్ దీపాలంకరణతో వెలుగులీనుతున్నాయి. ఆదివారం ఉదయం 8.30గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, శివసంకల్పం, స్వస్తి పుణ్యహవాచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, కంకణధారణలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం భ్రమరాంబాదేవిని మహాలక్ష్మి రూపంలో అలంకరిస్తారు. స్వామి అమ్మవార్లను భృంగి వాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఆరోజు రాత్రి 8 గంటల నుంచి శ్రీస్వామివార్లకు కల్యాణోత్సవం, శయనోత్సవపూజలను చేస్తారు. ఆలయ పూజావేళల్లో మార్పులు ఉగాది వేడుకలకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి చేరుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పూజా వేళలను మార్పు చేసినట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త శుక్రవారం ప్రకటించారు. ఉత్సవాలు ఆరంభం అయ్యే నాటి నుంచి ఈ నెల 30న ముగిసే వరకు ప్రతిరోజు వేకువజామున 3గంటలకు ఆలయద్వారాలు తెరచి సుప్రభాత, మహామంగళహారతి సేవలు.. అనంతరం 4గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు నిర్వీర్వామంగా దర్శనాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సాయంకాల పూజలు ముగిసిన తరువాత సాయంత్రం 5.30గంటల నుంచి అర్ధరాత్రి 2గంటల వరకు దర్శనాలు కొనసాగేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆర్జితసేవల నిలుపుదల ఉగాది మహోత్సవాల సందర్భంగా మల్లన్న గర్భాలయంలో జరిగే ఆర్జిత అభిషేకాలు, అమ్మవారి అంతరాలయంలో జరిగే కుంకుమార్చన సేవ టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఈఓ తెలిపారు. అయితే భక్తుల సౌకర్యార్థం వృద్ధ మల్లికార్జునస్వామివార్ల వద్ద రుద్రాభిషేకం, అమ్మవారి ఆశీర్వచన మండపంలో కుంకుమార్చన పూజలను నిర్వహించుకోవడానికి అనుమతించినట్లు పేర్కొన్నారు. -
వైభవంగా మల్లన్న శ్రీగిరి ప్రదక్షిణ
శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శనివారం.. గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీశైలానికి ముఖద్వారాలైన త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపూర్ దేవాలయాలను దర్శించుకుని తిరిగి మల్లన్నను దర్శించుకుంటే శ్రీగిరి ప్రదక్షిణ చేసినట్లవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ కాలంలో తపసంపన్నులైన మునులు, రుషులు, యతులు వాయువేగంతో 24గంటల వ్యవధిలో గిరిప్రదక్షిణను చేసుకునే వారని అంటారు. అంతటి మహిమాన్వితమైనదే శనివారం శ్రీశైలంలో జరిగిన శ్రీగిరిప్రదక్షిణ. శ్రీశైలక్షేత్రానికి వలయకారంలో 6 కి.మీ రోడ్డుమార్గంగా నిర్మించిన రింగ్‌రోడ్డు ద్వారా శ్రీగిరి ప్రదక్షిణ చేస్తే నాలుగు ముఖద్వారాలను దర్శించుకున్నంత ఫలం దక్కుతుందని పీఠాధిపతులు, పండితులు చెబుతున్నారు. ఇందులో భాగంగా శనివారం మహామంగళహారతిసేవల అనంతరం స్వామిఅమ్మవార్లను పల్లకీలో అధిష్టింపజేసి షోడశోపచార పూజలను ఏఈఓ కృష్ణారెడ్డి, అర్చకులు,వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయప్రదక్షిణ అనంతరం పల్లకీని ఊరేగింపుగా గంగాధర మండపం, అంకాలమ్మగుడి, నందిమండపం, గంగాసదన్ వద్ద ఉన్న వినాయక ఆలయం, యజ్ఞవాటిక, శ్రీగిరికాలనీ, మల్లమ్మకన్నీరు ఆలయం, పంచమఠాలు, రుద్రుని పార్కు, సిద్ధిరామప్పకొలను పై భాగం,క్షత్రియ రాజుల సత్రం నుంచి నందిమండపం చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించక నేరుగా మల్లన్న ఆలయప్రాంగణం చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగిసింది. -
శ్రీగిరికి పోటెత్తిన భక్తజనం
- రెండురోజులుగా ఇదే పరిస్థితి - ఆలయ పూజావేళల్లో మార్పులు శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల దర్శనానికి సోమవారం కూడా భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో గత శుక్రవారం నుంచి ప్రారంభమైన రద్ధీ శని, ఆది, సోమవారాలు కొనసాగింది. సోమవారం సుమారు 80వేలకు పైగా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. మన రాష్ట్రం నుంచేగాకుండా తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు వేకువజామున 5.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఉచిత, ప్రత్యేక దర్శన భక్తులకు దూర దర్శనం ఏర్పాటు చేశారు. సామూహిక, ప్రత్యేక అభిషేకం సేవాదారులను గర్భాలయంలోకి అనుమతించారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు భక్తులరద్ధీ సాధారణ స్థాయిలో ఉంటుదనే అంచనాతో ఉన్నారు. శివదీక్షా విరమణ కార్యక్రమం ఆదివారంతో ముగిసినప్పటికీ సోమవారం కూడా శివదీక్షా ఇరుముడులను సమర్పించేందుకు వందల సంఖ్యలో స్వాములు చేరుకున్నారు. దీంతో వారికి ప్రత్యేకంగా స్వామివార్ల స్పర్శదర్శనాన్ని కల్పించారు. పూజా వేళల్లో మార్పులు.. భక్తుల రద్దీని దృష్టిలోఉంచుకుని ఆలయ పూజావేళల్లో మార్పులు చేశారు. మంగళవారం వేకువజామున 4.30గంటలకు మంగళవాయిద్యాలు, 5గంటలకు సుప్రభాతం, 6గంటలకు మహామంగళహారతి, 6.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యలా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 6 నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు తిరిగి ప్రారంభమవుతాయి. -
శ్రీగిరిలో శివచతుస్సప్తాహ భజనలు
శ్రీశైలం : శ్రావణ మాసం సందర్భంగా శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో బుధవారం నుంచి శివచతుస్సప్తాహ భజనలlు నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త మంగళవారం తెలిపారు. దేవస్థానం లోకకల్యాణార్థం ఏటా శ్రావణమాసంలో ఈ అఖండ శివనామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. శ్రావణశుద్ధపాఢ్యమి నుంచి సెప్టెంబర్ 2 భాద్రపదశుద్ధపాఢ్యమి వరకు నిరంతరాయంగా కార్యక్రమం సాగుతుందన్నారు. కర్నూలుకు చెందిన 4 భజనబందాలతోపాటు కర్ణాటకలోని రాయచూర్ జిల్లా గోపానదేవహరళ్లి నుంచి ఒక బందానికి ఇందులో అవకాశం కల్పించినట్లు తెలిపారు. వీరు ఈ మాసమంతా రాత్రింబవళ్లు నిరంతరంగా ఓంనమఃశివాయ పంచాక్షరి ప్రణవభజనలు చేస్తారన్నారు. 456 వంవత్సరాలుగా దేవస్థానం ప్రతి శ్రావణమాసంలో ఈ అఖండభజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు.