వైభవంగా మల్లన్న శ్రీగిరి ప్రదక్షిణ
శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శనివారం.. గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీశైలానికి ముఖద్వారాలైన త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపూర్ దేవాలయాలను దర్శించుకుని తిరిగి మల్లన్నను దర్శించుకుంటే శ్రీగిరి ప్రదక్షిణ చేసినట్లవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ కాలంలో తపసంపన్నులైన మునులు, రుషులు, యతులు వాయువేగంతో 24గంటల వ్యవధిలో గిరిప్రదక్షిణను చేసుకునే వారని అంటారు. అంతటి మహిమాన్వితమైనదే శనివారం శ్రీశైలంలో జరిగిన శ్రీగిరిప్రదక్షిణ. శ్రీశైలక్షేత్రానికి వలయకారంలో 6 కి.మీ రోడ్డుమార్గంగా నిర్మించిన రింగ్‌రోడ్డు ద్వారా శ్రీగిరి ప్రదక్షిణ చేస్తే నాలుగు ముఖద్వారాలను దర్శించుకున్నంత ఫలం దక్కుతుందని పీఠాధిపతులు, పండితులు చెబుతున్నారు.
ఇందులో భాగంగా శనివారం మహామంగళహారతిసేవల అనంతరం స్వామిఅమ్మవార్లను పల్లకీలో అధిష్టింపజేసి షోడశోపచార పూజలను ఏఈఓ కృష్ణారెడ్డి, అర్చకులు,వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయప్రదక్షిణ అనంతరం పల్లకీని ఊరేగింపుగా గంగాధర మండపం, అంకాలమ్మగుడి, నందిమండపం, గంగాసదన్ వద్ద ఉన్న వినాయక ఆలయం, యజ్ఞవాటిక, శ్రీగిరికాలనీ, మల్లమ్మకన్నీరు ఆలయం, పంచమఠాలు, రుద్రుని పార్కు, సిద్ధిరామప్పకొలను పై భాగం,క్షత్రియ రాజుల సత్రం నుంచి నందిమండపం చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించక నేరుగా మల్లన్న ఆలయప్రాంగణం చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగిసింది.