మారుమోగిన ఈరన్న నామస్మరణ
మారుమోగిన ఈరన్న నామస్మరణ
Published Mon, Aug 22 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
– ఇసుక వేస్తే నేలరాలనంతగా భక్తజనం
– పోటెత్తిన ఉరుకుంద క్షేత్ర పరిసరాలు
కౌతాళం: శ్రావణ మాసం మూడో సోమవారం సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం కిక్కిరిసిపోయింది. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో తరలిరావడంతో సుమారు 2 కిలోమీటర్ల వరకు ఆలయ పరిసరాలు ఎటు చూసినా భక్తులే కనిపించారు. సుమారు 3 లక్షల మంది స్వామిని దర్శించుకుని ఉంటారని అంచన. శ్రావణమాసంలో సోమ, గురువారాలను ముఖ్యమైనవిగా భావిస్తుండడంతో ఆరోజుల్లో భక్తులు రద్దీ అధికంగా ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం రాత్రి 7 గంటల వరకు దర్శన క్యూలైన్లు అన్నీ భక్తులతో దర్శనమిచ్చాయి. ఆలయ పరిసరాల్లో కొద్దిపాటి చోటు దొరికితే చాలు పొయ్యి పెట్టి నైవేద్యం వండడం కనిపించింది.
దైవదర్శనానికి 4గంటల నిరీక్షణ..
దిగువ కాలువలో పుణ్య స్నానాల అనంతరం క్యూ కట్టిన భక్తులు స్వామివారి దర్శనం కోసం నాలుగు గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. మూడు కల్యాణ కట్టలు ఏర్పాటు చేసినా భక్తులకు నీరీక్షణ తప్పలేదు. గుండు గీయించుకునేందుకు టికెట్‌తో పాటు రూ.50 అదనంగా వసూలు చేస్తుండడం కనిపించింది. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చెన్నబసప్ప, పాలక మండలి సభ్యులు కొట్రేష్‌గౌడ్, మల్లికార్జున, తిక్కయ్య, నరసన్న, ఆలయ ఈఓ మల్లికార్జున ప్రసాద్ భక్తుల సేవలో మునిగిపోయారు. ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాస్‌రావు ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు క్షేత్రంలోనే మకాం వేసి ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. సీఐ దైవప్రసాద్, కౌతాళం ఎస్‌ఐ నల్లప్ప, మరో ఆరుగురు ఎస్‌ఐలు, ఆరవై మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 70మంది ఎన్‌సీసీ విద్యార్థులు, వివిద సేవ సంఘాలకు చెందిన 50మంది భక్తులకు సేవలు అందించారు.
Advertisement