భారీ బందోబస్తు
భారీ బందోబస్తు
Published Sun, Mar 19 2017 9:50 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ను పురస్కరించుకొని పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, అభ్యర్థుల అనుచరులు పెద్ద ఎత్తున కర్నూలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథంయలో ఓట్ల లెక్కింపు జరిగే కర్నూలు ప్రభుత్వ టౌన్‌మోడల్ హైస్కూలు వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
ఒక ప్లటూన్ కేంద్ర బలగాలతో పాటు ఒక ప్లటూన్ ఏపీఎస్‌పీ బలగాలు, ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 20 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, వందమంది కానిస్టేబుళ్లను బందోబస్తు విధులకు నియమించారు. అలాగే ఆరు పికెట్లు, మూడు చెక్‌పోస్టులు, ఐదు స్ట్రైకింగ్ ఫోర్సులు, నాలుగు ముబైల్ పార్టీలతో పాటు బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సెక్షన్–144 సీఆర్‌పీసీ, 30 పోలీస్‌యాక్ట్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం సమీపంలో ప్రజలు గుంపులు గుంపులుగా చేరితే చెదర గొట్టేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను నియమించారు.
ర్యాలీలపై నిషేధం
గెలుపొందిన అభ్యర్థికి అనుకూలంగా మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం ఎన్నికల సందర్భంగా సర్వసాధారణం. అయితే ఈ సారి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీపై పోలీసు అధికారులు నిషేధం విధించారు. డప్పులు వాయించడం, పెద్ద శబ్దాలు చేయడం, బాణ సంచా పేల్చడం వంటి వాటిపై కూడా నిషేధం విధించినట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ వెల్లడించారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌తో పాటు, పదోతరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకొంది. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టారు. పోలీసు ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.
రాకపోకలపై ఆంక్షలు..
ప్రభుత్వ టౌన్ మోడల్ స్కూలు మీదుగా ఇతర ప్రాంతాల నుంచి పాత»బస్టాండు వైపు వెళ్లే వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఇతర పట్టణంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రధాన రహదారి గుండా పాతబస్టాండుకు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు. వాహన చోదకులు కూడా ఈ విషయాన్ని గమనించి పోలీసు శాఖతో సహకరించాలని ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి సుమారు 500 మీటర్ల వరకు నాయకుల వాహనాలు కానీ, నాయకుల అనుచరులు, పార్టీ కార్యకర్తలు కానీ రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
Advertisement